Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండి వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
వివరాలు
రాష్ట్ర వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా వివరాలు
మరోవైపు భారత వాతావరణశాఖ (ఐఎండీ) కూడా రాష్ట్ర వాతావరణ పరిస్థితులపై తాజా వివరాలను వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో అత్యధికంగా 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా గుడివాడ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో చెరో 3.5 సెంటీమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 3.3 సెంటీమీటర్లు నమోదయ్యాయి.
వివరాలు
40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు
ఏలూరు జిల్లా భీమడోలులో 3 సెంటీమీటర్లు, కైకలూరులో 2.9 సెంటీమీటర్లు, విజయనగరంలో 2.7 సెంటీమీటర్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2.6 సెంటీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి వద్ద 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఇదిలా ఉండగా శుక్రవారం, శనివారం కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వివరాలు
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత
అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈసారి ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేస్తూ పంటల సాగులో అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.