Page Loader
అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం
అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ రెండురోజుల పర్యటన

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం

వ్రాసిన వారు Stalin
Jan 03, 2023
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

అరుణాచల్‌ప్రదేశ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం, బుధవారం పర్యటించనున్నారు. తవాంగ్ సెక్టార్‌లోని ఎల్‌ఎసీ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)కు చెందిన 27 ప్రాజెక్టులతో సహా సరిహద్దులోని కీలకంగా భావిస్తున్న సియోమ్ వంతెనను బుధవారం రాజ్‌నాథ్ ప్రారంభించనున్నారు. రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భవిష్యత్ ప్రణాళికతోపాటు, న్యూ టెక్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేయనున్నారు. అలాగే స్థానిక ప్రజలతో రక్షణ మంత్రి సమావేశం కానున్నారు.

రాజ్‌నాథ్‌సింగ్

100 మీటర్ల పొడవుతో సియోమ్ వంతెన నిర్మాణం

అరుణాచల్‌ప్రదేశ్‌ పర్యటనలో రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించే సియోమ్ వంతెన‌ చాలా కీలకమైనది. సియోమ్ నదిపై ఈ వంతెనను 100 మీటర్ల పొడవుతో నిర్మించారు. చైనా సరిహద్దులో వ్యూహాత్మకంగా ఈ వంతెనను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది. భారత్- చైనా సరిహద్దులోని వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వెంబడి త్వరితగతిన ద‌ళాల‌ను మోహరించడానికి సియోమ్ వంతెన‌ ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత ఐదేళ్లలో దాదాపు 3,097 కిలోమీట‌ర్ల రోడ్ల‌ను నిర్మించడం గమనార్హం. డిసెంబర్ 9న త‌వాంగ్ సెక్టార్‌లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఎల్ఏసీ విషయంలో చైనా ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటూ.. చైనాపై భారత్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది.