Rapthadu: రాప్తాడు నిందితుడు హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం
ఈ వార్తాకథనం ఏంటి
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడి కుడికాలికి రక్తప్రసరణ నిలిచిపోయింది. దీంతో కాలు కుళ్లిపోవడంతో ఇటీవల వైద్యులు దానిని తొలగించారు. అప్పటి నుంచి అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం హేమంత్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. ఈ క్రమంలో మంచంపై నుంచి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు సీటీ స్కాన్ చేయించగా పల్మనరీ ఎంబాలిజం సమస్య బయటపడింది. దీంతో అతడికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
రక్తం చిన్నచిన్న గడ్డలుగా మారడం వల్ల ఈ సమస్య
శస్త్రచికిత్సల అనంతరం తలెత్తే తీవ్రమైన సమస్యల్లో పల్మనరీ ఎంబాలిజం కూడా ఒకటని వైద్య నిపుణులు తెలిపారు.
శరీరంలోని రక్తం చిన్నచిన్న గడ్డలుగా మారడం వల్ల ఈ సమస్య వస్తుందని వివరించారు.
ఇలా ఏర్పడిన రక్తపు గడ్డలు ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో చిక్కుకుపోతే రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుందని చెప్పారు.
దీనివల్ల గుండెపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.