Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ వ్యవస్థ.. విద్యా ప్రమాణాలపై మంత్రి లోకేశ్ ఫోకస్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విద్యారంగంలో మౌలిక వసతులపైన ప్రత్యేక దృష్టి సారించి, రేటింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు జిల్లాలు, మండలాల వారీగా అకడమిక్ ప్రమాణాలు, మౌలిక సదుపాయాల ఆధారంగా రేటింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే అంశాలపై సమగ్ర సమాచారం కలిగి ఉండాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు సరైన విధంగా ఉండేలా చూడాలని సీఎం ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారని చెప్పారు. ఉన్నత విద్యాశాఖలో హాస్టళ్ల పరిశుభ్రత, టాయిలెట్లకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నట్లు మంత్రి తెలిపారు.
విద్యార్థుల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్
ఈ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నామని, విద్యార్థుల నుండి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం ప్రారంభించినట్లు వెల్లడించారు. కేజీ నుండి పీజీ వరకూ పాఠ్యాంశాల్లో అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నారా లోకేశ్ తెలిపారు. విద్య, మౌలిక వసతుల అభివృద్ధిపై తీసుకుంటున్న ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.