Cooking Oil Prices: సామాన్యులకు ఊరట.. వంటనూనె ధరలు తగ్గే సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. ప్రస్తుతం క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లపై 20 శాతం దిగుమతి పన్ను విధిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ మూడు చమురులపై మొత్తం దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గనుంది. భారతదేశంలో వినియోగిస్తున్న వంటనూనెలలో సుమారు 70 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం.
Details
కస్టమ్స్ సుంకాన్ని 20 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే
పామాయిల్‌ను ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయం వల్ల వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ధరలు తగ్గితే డిమాండ్ కూడా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 2024లో క్రూడ్, రిఫైన్ వంటనూనెలపై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ధరల నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.