LOADING...
Monsoon Season: ఉక్కపోతకు ఉపశమనం.. మే చివర్లో రుతుపవనాల రాక
ఉక్కపోతకు ఉపశమనం.. మే చివర్లో రుతుపవనాల రాక

Monsoon Season: ఉక్కపోతకు ఉపశమనం.. మే చివర్లో రుతుపవనాల రాక

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎండలు తీవ్రంగా పెరిగాయి. ఉదయం నుంచే భానుడు కాఠిన్యంగా మండిపోతుండగా, మధ్యాహ్నానికి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. బయటకు రావాలంటేనే ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఉక్కపోత, చెమటలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏప్రిల్‌ నెల ముగింపు దశకు చేరుకుంటుండగా, మే నెలలో రోహిణి కార్తె వేడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి ఉపశమనం కలిగించే సమాచారం వచ్చింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే భారతదేశంలోకి ప్రవేశించే అవకాశముందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ అంచనా వేసింది. మే నెలాఖరుకల్లా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

వివరాలు

ప్రజలకు త్వరలోనే ఉపశమనం

దీంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది రైతులకు కూడా అనుకూల పరిణామంగా కనిపిస్తోంది. గత ఏడాది (2025) కూడా రుతుపవనాలు ముందుగానే వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా మే 27 నుంచి 29 మధ్య వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని మౌసమ్‌ తక్ వ్యవస్థాపకుడు దేవేంద్ర త్రిపాఠి తెలిపారు. అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో మే 18 నుంచి 25 మధ్యనే రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం నైరుతి దిశ నుంచి వీస్తున్న బలమైన గాలులు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రంపై ప్రభావం చూపుతున్నాయని ఆయన వివరించారు.

వివరాలు

సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం

ఈ ప్రభావంతో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, సాధారణం కంటే 30 నుంచి 60 మిల్లీమీటర్ల వరకు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. మే 25 నుంచి జూన్‌ 1 మధ్య రుతుపవనాలు పశ్చిమ, ఉత్తర దిశలకు విస్తరించనున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడే బలమైన పశ్చిమ గాలులు తేమను భారత నైరుతి తీరానికి మళ్లిస్తాయని భావిస్తున్నారు. దీంతో కేరళ, తమిళనాడు దక్షిణ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముంది. రుతుపవనాల రాక సమయానికి ఎల్‌నినో ప్రభావం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎండలతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement