Telangana: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభం.. అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మెకు సర్వం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సమ్మె ప్రారంభం కానుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారిక ఆహ్వానం రాకపోవడం, డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మె దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. జేఏసీతో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించడంతో, ఆర్టీసీలోని దాదాపు అన్ని యూనియన్లు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
వివరాలు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వ్యూహాలు
ఈ పరిస్థితుల దృష్ట్యా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం తన నివాసంలో ఆర్టీసీ ఎండీ వి. నాగి రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమ్మె సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు, వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. సమ్మె మరింత విస్తరించి 'సకల జనుల సమ్మె'లా మారే అవకాశముందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న పేర్కొన్నారు. 'ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపే ప్రయత్నాలను ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. సమ్మెను విజయవంతం చేసి సమస్యలకు పరిష్కారం సాధిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నంలోగా స్పందించకపోతే తామూ సమ్మెలో చేరతామని అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. దీంతో తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఈసమ్మె గణనీయమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.