UNSC: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్‌ను చేర్చాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఈ ప్రకటన చేశారు. ఐక్యరాజ్యసమితితో పాటు దాని ఏజెన్సీలను తక్షణమే సంస్కరించాలని అలిపోవ్ పిలుపునిచ్చారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాలపై దృష్టి సారించిన ఎజెండాతో పాటు సమతుల్యతను ప్రోత్సహించడంలో భారత్ ముఖ్యమైన సహకారం అందించగలదని తాను భావిస్తున్నట్లు రష్యా రాయబారి తెలిపారు. భారత అభ్యర్థిత్వానికి తమ మద్దతును పదేపదే తెలియజేస్తున్నామన్నారు.
కౌన్సిల్‌ను విజయవంతంగా రెండు సార్లు నడిపిన భారత్: డెనిస్ అలిపోవ్
భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోయినా.. తాత్కాలిక సభ్యత్వంతో కౌన్సిల్‌ను రెండు సార్లు విజయవంతంగా నడిపినట్లు డెనిస్ అలిపోవ్ గుర్తు చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మండలిలో జరిగిన అనేక చర్చల్లో భారత్ ఏకాభిప్రాయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. జీ20 సభ్య దేశాలన్నింటిని 'దిల్లీ డిక్లరేషన్'పై ఏకతాటిపై తీసుకురావడమే భారత్ సమర్థతను స్పష్టం చేస్తుందని డెనిస్ అలిపోవ్ చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలు గ్రూపులుగా విడిపోవడం వల్ల మండలి విస్తరణపై జరుగుతున్న చర్చలు విజయవంతం కావడం లేదన్నారు.