Supreme Court: సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడుభాషలు నేర్చుకోవాలంటూ సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం,సీబీఎస్‌ఈ,ఎన్‌సీఈఆర్‌టీలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమగ్ర వివరణ సమర్పించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ,జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. భాష అనేది వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన అంశమని,దానిని బలవంతంగా అమలు చేయడం సరికాదని కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశం రాజ్యాంగ పరిరక్షణలకు సంబంధించినదని కూడా ఆయన పేర్కొన్నారు.
వివరాలు
మూడో భాషగా మాత్రమే విదేశీ భాష
అయితే ఈ దశలో మధ్యంతర ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.అలాగే త్రిభాషా విధానాన్ని అమలు చేసేందుకు సీబీఎస్‌ఈ ఎంతవరకు సిద్ధంగా ఉందో వివరించే నివేదిక సమర్పించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటీకి ధర్మాసనం సూచించింది. ఇదిలా ఉండగా,2026-27విద్యా సంవత్సరంనుంచి 9వతరగతి విద్యార్థులు రెండు భారతీయ భాషలతో పాటు మొత్తం మూడు భాషలు తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుందని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. విదేశీ భాషను చదవాలనుకునే విద్యార్థులు దానిని మూడో భాషగా మాత్రమే ఎంచుకోవచ్చని ఈ నెల 15న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కొత్త జాతీయ విద్యా విధానం-2020,పాఠశాల విద్య జాతీయ పాఠ్య ప్రణాళిక-2023మార్గదర్శకాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.