Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అరుదైన ఘనత.. దేశంలో నాలుగో స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
సికింద్రాబాద్ జంక్షన్ దేశంలో అత్యధిక వార్షికాదాయం పొందుతున్న రైల్వే స్టేషన్ల జాబితాలో తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రయాణికుల రాకపోకలు, ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం పరంగా దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ స్టేషన్‌కు ప్రయాణికుల టికెట్ల ద్వారా రూ.1,276.29 కోట్ల ఆదాయం సమకూరింది. అదే సమయంలో సుమారు 2.78 కోట్ల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించారు. ఈ వివరాలను రైల్వే శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న స్టేషన్లలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో అక్కడ రూ.3,337 కోట్ల ఆదాయం నమోదైంది. రూ.1,692 కోట్లతో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రెండో స్థానంలో నిలిచింది.
వివరాలు
రోజుకు 180కి పైగా రైళ్ల రాకపోకలు
తమిళనాడులోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రూ.1,299కోట్ల ఆదాయంతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఆ తర్వాత రూ.1,276.29కోట్ల ఆదాయంతో సికింద్రాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఉత్తర,దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన రైల్వే కేంద్రంగా సికింద్రాబాద్ ఉండటం ఈ స్థాయి ఆదాయానికి కీలక కారణమని రైల్వే శాఖ పేర్కొంది.
దక్షిణ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయం కూడా సికింద్రాబాద్‌లోనే ఉంది.
దీంతో ఈ స్టేషన్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రోజూ 180కి పైగా రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి.
ప్రతిరోజూ సుమారు 1.5లక్షల నుంచి 2లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగిస్తున్నారు.
ఇంత భారీగా రైళ్లు,ప్రయాణికుల రాకపోకలు ఉండటంతో సికింద్రాబాద్ దేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటిగా కొనసాగుతోంది.
వివరాలు
రూ.714 కోట్లతో ఆధునికీకరణ
ప్రస్తుతం అమృత్ భారత్ పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
సుమారు రూ.714 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.
విమానాశ్రయాలను తలపించేలా ప్రపంచ స్థాయి ప్రయాణికుల సౌకర్యాలు కల్పించడం ఈ ప్రాజెక్టులో ప్రధాన భాగం.
మెట్రో రైలు అనుసంధానం, మల్టీ-లెవల్ పార్కింగ్ వంటి సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
వివరాలు
రూ.714 కోట్లతో ఆధునికీకరణ
ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
దీంతో భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నడపడంతో పాటు ఎక్కువ మంది ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ అభివృద్ధితో సికింద్రాబాద్ దేశంలోని టాప్-3 రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం స్టేషన్ ఆధునికీకరణ పనులు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉంది.