SCS Scheme: ఒక్కసారి పెట్టుబడి పెడితే...వద్దన్నా డబ్బులు వస్తూనే ఉంటాయ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంకొన్ని రోజుల్లో ఉద్యోగం పూర్తవుతుంది. నెలనెలా వచ్చే జీతం ఆగిపోతుంది. ఇన్నాళ్లూ కుటుంబం కోసం సంపాదించాను. ఇకపై ఖర్చులకు డబ్బులు ఎలా? అని రిటైర్మెంట్కు సిద్ధమవుతున్న ఓ పెద్దాయన తన ఆందోళనను స్నేహితుడి కొడుకుతో పంచుకున్నాడు. "అంకుల్.. రిటైర్మెంట్ తర్వాత ఆదాయం గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) గురించి తెలుసా?" అంటూ ఆ యువకుడు మాట కలిపాడు. ఆ పథకం వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు.
Details
8.2 శాతం వడ్డీ.. మూడు నెలలకోసారి డబ్బులు
"ఈ పథకంలో పెట్టుబడి పెడితే స్థిరమైన వడ్డీ ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అంటే 2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు SCSSపై వార్షిక వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.
అయితే వడ్డీని ఏడాదికి ఒకసారి కాదు.. ప్రతి మూడు నెలలకోసారి చెల్లిస్తారు. ఉదాహరణకు రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.82,000 వడ్డీ వస్తుంది.
అంటే ప్రతి త్రైమాసికానికి సుమారు రూ.20,500 అందుతుంది" అని వివరించాడు. దీంతో ఆ పెద్దాయన ఆసక్తిగా వినడం మొదలుపెట్టాడు.
Details
60 ఏళ్లు దాటకపోయినా అర్హత ఉందా?
"అయితే 60 ఏళ్లు నిండినవారే ఇందులో చేరాలా?" అని పెద్దాయన అడిగాడు. "అందరికీ ఆ నిబంధన లేదు అంకుల్.. 60 ఏళ్లు నిండినవారు ఉద్యోగంలో ఉన్నా ఈ ఖాతా తెరవవచ్చు.
55 ఏళ్లు దాటి 60 ఏళ్లలోపు ఉన్న కొందరు రిటైర్డ్ పౌర ఉద్యోగులు కూడా నిర్దేశిత నిబంధనలతో అర్హులు. రిటైర్మెంట్ ప్రయోజనాలు అందుకున్న తర్వాత నిర్ణీత గడువులో దరఖాస్తు చేయాలి.
రక్షణ దళాల రిటైర్డ్ సిబ్బందికి 50 ఏళ్ల నుంచే అవకాశం ఉంది. అయితే ఇతర షరతులు వర్తిస్తాయి" అని చెప్పాడు.
Details
రూ.30 లక్షల వరకు పెట్టుబడి.. ఐదేళ్ల గడువు
"కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. ఒక వ్యక్తి పెట్టుబడి పరిమితి గరిష్ఠంగా రూ.30 లక్షలు. ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. కావాలనుకుంటే మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు.
జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. పెట్టుబడిపై సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం లభించవచ్చు.
అయితే ఇది పాత పన్ను విధానంలో వర్తించే నిబంధనలకు లోబడి ఉంటుంది".
Details
పెట్టుబడికి ముందు ఈ విషయాలూ తెలుసుకోవాలి
"మరి ఎప్పుడైనా డబ్బులు వెనక్కి తీసుకోవచ్చా?" అన్న పెద్దాయన ప్రశ్నకు, "ముందుగానే ఖాతా క్లోజ్ చేసుకోవచ్చు. కానీ నిబంధనల ప్రకారం పెనాల్టీ పడుతుంది.
వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను ఉంటుంది. తీసుకోకుండా వదిలేసిన వడ్డీకి అదనపు వడ్డీ రాదు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి" అని యువకుడు సూచించాడు.
పెద్దాయన ముఖంలో ఆందోళన కాస్త తగ్గింది. రిటైర్మెంట్ తర్వాతి ఆర్థిక ప్రణాళికలో SCSS ఒక మార్గమని ఆయనకు అర్థమైంది.