Govt hikes windfall tax: డీజిల్, విమాన ఇంధనంపై పన్ను పెంపు.. పెట్రోల్ ఎగుమతులపై సుంకం తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పెంచింది. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న పన్నును సున్నాకు తగ్గించింది. ఈ కొత్త పన్ను రేట్లు అక్టోబర్ 31 నుంచి రెండు వారాల పాటు అమల్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నిర్ణయం ప్రకారం డీజిల్ ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED)ను లీటరుకు రూ.8.5 నుంచి రూ.11.5కు పెంచారు. విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్నును కూడా లీటరుకు రూ.10.5 నుంచి రూ.11కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పెట్రోల్ ఎగుమతులపై ప్రస్తుతం లీటరుకు రూ.2.5గా ఉన్న పన్నును పూర్తిగా తొలగించి సున్నాకు తగ్గించారు.
వివరాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పన్నుల పెంపు
అయితే దేశీయంగా వినియోగించే డీజిల్, పెట్రోల్‌పై ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకాల రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ నిర్ణయాలు కేవలం ఎగుమతులపై విధించే పన్నులకు మాత్రమే వర్తిస్తాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల విండ్‌ఫాల్ పన్ను విధించింది.
ఇందులో భాగంగా మార్చి 27న డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై పన్నులను పెంచింది. ఆ తర్వాత మే 16నుంచి పెట్రోల్ ఎగుమతులపై కూడా ఎగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తాజాగా మరోసారి డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై పన్ను రేట్లను పెంచగా, పెట్రోల్ ఎగుమతులపై సుంకాన్ని సున్నాకు తగ్గించింది. ఈ మార్పులు అక్టోబర్ 31నుంచి రెండు వారాల పాటు అమల్లో ఉండనున్నాయి.