Nirmala Sitharaman: ఐడీబీఐ బ్యాంక్ విక్రయంపై రాహుల్ విమర్శలు.. నిర్మలా సీతారామన్ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐడీబీఐ బ్యాంక్‌లో మెజార్టీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులకు తన మద్దతు ప్రకటించారు. లాభాల బాటలో కొనసాగుతున్న బ్యాంకును విక్రయించాల్సిన అవసరం ఏముందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులపై రాజకీయ ఒత్తిళ్లు ఉండేవని నిర్మలమ్మ ఆరోపించారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే రాజకీయ పలుకుబడి ఉన్న వ్యాపారవేత్తలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకొచ్చారని విమర్శించారు.
వివరాలు
రూ.25 వేల కోట్లకు పైగా మూలధనాన్ని సమకూర్చి..బ్యాంకును తిరిగి గాడిలో పెట్టాం: నిర్మలా సీతారామన్
ఈ విధానాల వల్ల ఐడీబీఐ బ్యాంక్ భారీగా మొండి బకాయిల సమస్యను ఎదుర్కొందని పేర్కొన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఐడీబీఐ బ్యాంక్ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదని నిర్మలా సీతారామన్ తెలిపారు.
అలాంటి పరిస్థితుల్లో ఉన్న బ్యాంకును తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని చెప్పారు.
ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరించిన ముందుచూపుతో కూడిన విధానాల వల్ల బ్యాంకు మళ్లీ నిలదొక్కుకుందని వివరించారు.
రూ.25 వేల కోట్లకు పైగా మూలధనాన్ని సమకూర్చి, బ్యాంకును తిరిగి గాడిలో పెట్టామని వెల్లడించారు.
ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ వృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
వివరాలు
సామాన్య ప్రజలకు కూడా సులభంగా రుణాలు
బ్యాంకు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో అన్ని నిబంధనలను తూచా తప్పకుండా పాటించామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు వెల్లడించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థలో పలుకుబడి ఉన్నవారికి ఒక రకమైన నిబంధనలు, సామాన్య ప్రజలకు మరో రకమైన నిబంధనలు అమలయ్యేవని విమర్శించారు.
ప్రస్తుతం అలాంటి పరిస్థితులకు ముగింపు పలికామని అన్నారు. సామాన్య ప్రజలకు కూడా సులభంగా రుణాలు అందుతున్నాయని వివరించారు.
రుణాలు మంజూరు చేయాలంటూ ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంకు ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని నిర్మలా సీతారామన్ తన పోస్టులో స్పష్టం చేశారు.
వివరాలు
రూ.52,878 కోట్లకు విక్రయించే ప్రతిపాదనకు ఆమోదం
ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం, భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కలిపి కలిగి ఉన్న 60.72 శాతం మెజార్టీ వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థకు రూ.52,878 కోట్లకు విక్రయించే ప్రతిపాదనకు అక్టోబరు 14న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అయితే ఈ నిర్ణయాన్ని ఐడీబీఐ బ్యాంకు అధికారులు, ఉద్యోగుల ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్) వ్యతిరేకిస్తోంది.
వాటాల విక్రయ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ పర్యవేక్షణలో సమగ్ర సమీక్ష నిర్వహించాలని కోరుతోంది.
వివరాలు
రూ.52,878 కోట్లకు విక్రయించే ప్రతిపాదనకు ఆమోదం
మరోవైపు, ప్రస్తుతం లాభాలు ఆర్జిస్తున్న ఐడీబీఐ బ్యాంకును విక్రయించడం సరైన నిర్ణయం కాదని రాహుల్ గాంధీ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశ అభివృద్ధి కోసం బ్యాంకులను ఏర్పాటు చేస్తే.. ప్రధాని మోదీ పాలనలో వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయ అంశం కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ చర్చకు దారితీసింది.