Supreme Court: మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 550 ఎకరాలకు పైగా భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న భూములపై ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను కోర్టు అభినందించింది. ఈ భూములు తమకు చెందినవంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు గతంలో హక్కులు కోరారు. ఈ క్రమంలో 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ అప్పీళ్లను విచారించిన సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. దీంతో 550 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న భూములపై ప్రభుత్వ వాదనకు మద్దతు లభించింది.
వివరాలు
GPA రిజిస్ట్రేషన్ల రద్దును సమర్థించిన హైకోర్టు
మియాపూర్ భూములకు సంబంధించి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని 2003లోనే ఉమ్మడి హైకోర్టు సమర్థించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ పార్థసారధి, సువిశాల్ జైన్ తదితరులు సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.
జాగీర్దార్ కైసరుద్దీన్ చట్టబద్ధమైన వారసులైన అమీరున్నిషా తదితరుల నుంచి ఈ భూములను చట్టబద్ధంగా పొందినట్లు పార్థసారధి, సువిశాల్ జైన్ వాదించారు.
తమకు ఉన్న తిరుగులేని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (Irrevocable GPA), సనద్ హక్కులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు.
రిజిస్టర్డ్ పత్రాలను రద్దు చేసే అధికారం శేరిలింగంపల్లి మండల తహసీల్దార్‌కు లేదని తమ వాదనలు వినిపించారు.
వివరాలు
పరిహారం చెల్లించడంతో హక్కులు వర్తించవన్న ప్రభుత్వం
ప్రైవేటు వ్యక్తుల వాదనలపై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.
జాగీర్దార్ కైసరుద్దీన్‌కు అప్పట్లోనే పరిహారం చెల్లించారని, అందువల్ల ఆయన వారసులమని చెప్పుకునే వారికి ఈ భూములపై హక్కులు కోరే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానం మౌనంగా ఉండలేదని పేర్కొంది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చూపిన ప్రత్యేక చొరవను కూడా అభినందించింది.