Hero Destini 110 Classique Edition: హీరో డెస్టినీ 110 క్లాసిక్ ఎడిషన్ విడుదల.. ధర,ఫీచర్లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని డెస్టినీ 110 క్లాసిక్ ఎడిషన్‌ను విడుదల చేసింది. కొత్త రంగులు, ప్రత్యేక డిజైన్ మార్పులతో తీసుకొచ్చిన ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధరను ఢిల్లీలో రూ.76,400గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న హీరో డీలర్‌షిప్‌లలో ఈ కొత్త ఎడిషన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
వివరాలు
రెండు ఆకర్షణీయమైన డ్యూయల్ టోన్ రంగులు
హీరో డెస్టినీ 110 క్లాసిక్ ఎడిషన్‌ను రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.
ఇందులో మొదటిది మ్యాట్ గోల్డ్‌ఫిష్ సిల్వర్-లైట్ ఇండస్ట్రియల్ గ్రే రంగుల కలయిక. దీనికి బ్రౌన్ కలర్ ఇన్నర్ ప్యానెల్స్‌ను జత చేశారు.
రెండో ఆప్షన్‌గా మ్యాట్ ఏరీస్ బ్రౌన్ రంగును అందిస్తున్నారు. ఇందులో బ్లాక్ కలర్ ఇన్నర్ ప్యానెల్స్ ఉంటాయి.
డిజైన్ పరంగా కూడా కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. ముందు హ్యాండిల్ కవర్, సైడ్ ప్యానెల్స్‌పై కొత్త స్ట్రైప్స్ ఇచ్చారు.
స్కూటర్ రంగులకు సరిపోయేలా రియర్ వ్యూ మిర్రర్స్, సీటును రూపొందించారు. వీటితోపాటు ప్రత్యేకమైన 3డీ క్లాసిక్ ఎడిషన్ బ్యాడ్జ్, రిమ్ టేప్‌ను జోడించారు.
వివరాలు
సౌకర్యాల విషయంలోనూ ప్రత్యేకతలు..
డెస్టినీ 110 సాధారణ మోడల్‌లో ఉన్న సౌకర్యాలనే క్లాసిక్ ఎడిషన్‌లోనూ కొనసాగించారు.
ఇందులో 785 మి.మీ. పొడవైన సీటు అందించారు. ముందు, వెనుక చక్రాలు 12 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తాయి.
వెనుక వైపు వెడల్పైన టైర్‌ను అమర్చారు. సీటు కింద 19 లీటర్ల సామర్థ్యంతో స్టోరేజ్ స్థలం ఉంది.
మొబైల్ ఛార్జింగ్ సదుపాయంతో కూడిన ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌ను కూడా అందించారు.
అదనంగా బూట్ ల్యాంప్ సౌకర్యం కల్పించారు.
డిజిటల్, అనలాగ్ ఫీచర్లతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ ఈ స్కూటర్‌లో ఉన్నాయి.
వివరాలు
ఇంజిన్‌లో మార్పుల్లేవ్.. ధర ఎంతంటే?
హీరో డెస్టినీ 110క్లాసిక్ ఎడిషన్‌లో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు.
గత మోడల్‌లో ఉపయోగించిన 110.9సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగించారు.
ఈ ఇంజిన్ 7,250 ఆర్‌పీఎం వద్ద గరిష్ఠంగా 8.15పీఎస్ శక్తిని,5,750 ఆర్‌పీఎం వద్ద 8.7ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
దీనికి ఆటోమేటిక్ సీవీటీ గేర్‌బాక్స్‌ను జత చేశారు.ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు హీరోకు చెందిన ఐ3ఎస్ (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) టెక్నాలజీని కూడా అందించారు.
ఢిల్లీలో ఈ కొత్త క్లాసిక్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.76,400.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డెస్టినీ 110వీఎక్స్ వేరియంట్‌తో పోలిస్తే దీని ధరరూ.1,400 ఎక్కువ.
కొత్త రంగులు,ప్రత్యేక డిజైన్ హంగులతో పండగ సీజన్‌లో కొనుగోలుదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా హీరో ఈ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.