Andhra News: మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ (78) సోమవారం కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో అనుకోకుండా కాలు జారి పడిపోవడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం సాయంత్రం 6:40 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. గత ఏడాది ఆయనకు మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స కూడా జరిగిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, అప్పలసూర్యనారాయణ 1983లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.
వివరాలు
సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
అనంతరం 1985లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985 నుంచి 1999 వరకూ వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, సామాజిక సంక్షేమం, మహిళా-శిశు సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పలసూర్యనారాయణ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో ఆయన చేసిన కృషిని ఒక ప్రకటనలో కొనియాడారు. అలాగే ఈ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.