Setback For AAP: పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. సోమవారం ఉదయం ఆప్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ ఐపీఎస్ అధికారి, అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరారు. అంతకుముందు ఆదివారం ఆప్‌కు రాజీనామా చేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సోమవారం బీజేపీ కండువా కప్పుకున్నారు.
వివరాలు
తొలి జాబితాలో టికెట్లు ప్రకటించకపోవడంతో ఎమ్మెల్యేల నిర్ణయం
బీజేపీలో చేరిన వారిలో అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్‌తో పాటు పటియాలా జిల్లాలోని సమనా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరమజ్రా,సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా ఉన్నారు.
ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో పంజాబ్‌లో ఆప్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ ఇటీవల 40 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
అయితే సమనా, సనౌర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.
ఈ రెండు స్థానాలకు పార్టీ కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించడంతో తమకు మరోసారి టికెట్లు దక్కకపోవచ్చని జౌరమజ్రా, పఠాన్‌మజ్రా భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారు పార్టీని వీడినట్లు వార్తలు వెలువడ్డాయి.
వివరాలు
ఆప్ నాయకత్వంపై ఎమ్మెల్యేల విమర్శలు
ఆప్‌ను వీడిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఢిల్లీ నాయకత్వం పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్య, పెరుగుతున్న అప్పుల భారం, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మరోవైపు, పార్టీని వీడిన లేదా సస్పెండ్ అయిన నాయకులను బీజేపీ తన పార్టీలో చేర్చుకుంటోందని పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా విమర్శించారు.