అయ్యో! సైబీరియన్ పక్షలకు ఎంత కష్టమొచ్చే; వడగండ్లతో విలవిల
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని మాధాపురం గ్రామానికి ప్రతి ఏటా వలస వచ్చే సైబీరియన్ పక్షులు అకాల వర్షాలు, వడగళ్ల వానలకు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా వడగళ్ల వానల వలన మృత్యువాత పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరులో వచ్చి గూళ్లు కట్టుకుని పిల్లలను పెంచి జులైలో వెళ్లిపోయే ఈ పక్షులకు మాధాపురం ప్రసిద్ధి. ఈ పక్షులను ఇక్కడి ప్రజలు చాలా సెంటిమెంట్‌గా భావిస్తారు. ఈ పక్షలు వస్తే ఆ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి ఏటా వలస వచ్చే ఆ పక్షులను ఏం అనకుండా అతిథులుగా వాటిని గ్రామస్థులు చూసుకుంటారు.
వడగళ్ల వానలకు పిల్లలను రక్షించుకునేందుకు పక్షుల తాపత్రయం
అయితే గత కొన్ని రోజులుగా ప్రతికూల వాతావరణం నేపథ్యంలో సైబీరియన్ పక్షులు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. వడగళ్ల వానలకు తమ పిల్లలను రక్షించుకునేందుకు తాపత్రయపడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని మృత్యువాత పడ్డాయి. గ్రామానికి సుభసూచికంగా భావించే పక్షులు మృతి చెందడంతో స్థానికులు అయ్యో పాపం అంటున్నారు. గతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినా, ఇలా వడగళ్ల వానలు పడటం చాలా అరుదని స్థానికులు చెబుతున్నారు.