తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు
అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. వాస్తవానికి మామిడి కాయల తడిచినా, మచ్చలు వచ్చినా మార్కెట్లో వాటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపరు. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు కాయలు ఎదగకముందే నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచే వాతావరణం మామిడి రైతులకు అనుకూలంగా లేదు. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండటం, వడగళ్ల వానలతో మామిడి కాయలు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లో ఆ కాయలకు ధర రాని పరిస్థితి నెలకొంది.
మార్కెట్లో కొనే దిక్కులేక దళారులను ఆశ్రయిన్న మామిడి రైతులు
మామిడి కాయలను మే ప్రారంభంలో తెంపుతారు. ఆ సమయానికి అవి మంచి పరిణామంలో ఉంటాయి. అమ్మినా మంచి ధర పలుకుతాయి. అకాల వర్షాల కారణంగా మామిడి కాయలు నిర్ణీత సమయం కంటే ముందే నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మే నెల ప్రారంభంలో తెంపే మామిడి కాయలు 500 గ్రాముల నుంచి కిలో బరువు వరకు ఉంటాయి. వర్షాల కారణంగా నేల రాలిన కాయలు 250గ్రాములకు మించి లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బరువు లేని కాయలను మార్కెట్లో ఎవరూ కొనరు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి, తక్కువ ధరకు పంటను విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పెట్టిన పెట్టుబడి ఏమో కానీ, రవాణా ఖర్చులు కూడా రావడం కష్టమని రైతులు వాపోతున్నారు.