Singareni: ఒడిశా నైనీ గని నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రైలు.. సింగరేణి చరిత్రలో మైలురాయి
ఈ వార్తాకథనం ఏంటి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చరిత్రలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఒడిశాలో సింగరేణికి చెందిన నైనీ బొగ్గు గని నుంచి తొలిసారిగా బొగ్గుతో నిండిన రైల్వే వ్యాగన్లు విజయవంతంగా తెలంగాణకు చేరాయి. మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP)కు ఈ బొగ్గు రైలు చేరుకోగా, అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ పరిణామంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం, అధికారులు, కార్మికులను ప్రత్యేకంగా అభినందిస్తూ, సంస్థ విస్తరణతో పాటు ఉత్పత్తి పెంపు దిశగా ఇది చిరస్మరణీయ ఘట్టంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వివరాలు
59 రైల్వే వ్యాగన్లలో సుమారు 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గు
తొలి విడతలో ఒడిశాలోని నైనీ గని నుంచి 59 రైల్వే వ్యాగన్లలో సుమారు 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గును జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు తరలించారు.
ఈ బొగ్గు అందుబాటులోకి రావడంతో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధన కొరత తగ్గడంతో పాటు రవాణా వ్యయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా నిర్ణయించిన లక్ష్యాల మేరకు నిరంతరాయంగా కొనసాగేందుకు సింగరేణి ఉన్నతాధికారులు మంగళవారం ఒడిశాలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సింగరేణి డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతమ్ పొత్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న అధ్యక్షత వహించారు.
వివరాలు
ఏడాదికి 6 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యం
సమీక్షా సమావేశంలో జిందాల్ స్టీల్, జిందాల్ ఇండియా పవర్ లిమిటెడ్, మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్తో పాటు ఇతర ప్రధాన బొగ్గు వినియోగదారుల ప్రతినిధులు, రవాణా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
బొగ్గు సరఫరా, రవాణా ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా గౌతమ్ పొత్రు మాట్లాడుతూ, నైనీ బొగ్గు గని నుంచి ఏడాదికి 6 మిలియన్ టన్నులు (60 లక్షల టన్నులు) బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.
అక్కడ ఉత్పత్తి అయ్యే బొగ్గును సమీప విద్యుత్ కేంద్రాలతో పాటు తెలంగాణలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు, అలాగే తమిళనాడులోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
వివరాలు
నైనీ గని నుంచి రోజుకు కనీసం 12 వేల టన్నుల బొగ్గు రవాణా జరిగేలా ప్రణాళిక
స్థానిక వినియోగదారులు, రైల్వే సైడింగ్‌లకు నిర్ణయించిన లక్ష్యాల ప్రకారం ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతిరోజూ బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని రవాణా సంస్థలకు సూచించారు.
రైలు మార్గం ద్వారా వేగవంతమైన రవాణా కోసం సమీపంలోని హిందోల్,కామాఖ్య నగర్ రైల్వే సైడింగ్‌లకు ప్రాధాన్యత ఆధారంగా సకాలంలో బొగ్గు చేరేలా చూడాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న ఆదేశించారు.
అలాగే, నైనీ గని నుంచి రోజుకు కనీసం 12 వేల టన్నుల బొగ్గు రవాణా జరిగేలా సింగరేణి యాజమాన్యం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది.
నైనీ గని పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా మరింత బలోపేతం అవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.