TG Stamps Registration: తెలంగాణలో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మక అమలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలకు వేగవంతమైన, అవినీతి రహిత సేవలను అందించడానికి, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌ను స్లాట్ బుకింగ్ విధానంతో పాటు బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఏప్రిల్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
భూముల క్రమబద్ధీకరణ కోసం "లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)"ను వేగవంతం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
వివరాలు
15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్
ప్రస్తుతం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతోంది.
ఈ వ్యవధిని తగ్గించేందుకు స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విధానం అమల్లోకి వస్తే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏప్రిల్ మొదటి వారంలో ప్రయోగాత్మకంగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి తెలిపారు.
కొత్త విధానంతో ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖను సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), చాట్‌బాట్ సేవలు వినియోగించాలని మంత్రి సూచించారు.
వివరాలు
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌పై కఠిన చర్యలు
నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయకూడదని మంత్రివర్యులు స్పష్టం చేశారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భూభారతి తరహాలో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసి, నిషేధిత ఆస్తుల వివరాలను రెవెన్యూ శాఖకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలం కూడా రిజిస్ట్రేషన్ చేసినా, క్షణాల్లో సమాచారం వెలుగులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
వివరాలు
ఎల్ఆర్ఎస్ (LRS) వేగవంతం
భూముల క్రమబద్ధీకరణలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
రిజిస్ట్రేషన్ అధికారులకు రోజువారీ సమీక్షలు నిర్వహించాలని, సమస్యలు ఉంటే పై అధికారులతో చర్చించి పరిష్కరించాలని సూచించారు.
దరఖాస్తులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా, ప్రజల ఎదురు చూపులకు తెరదించాలని అన్నారు.
ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, నిబంధనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్‌ను వేగంగా అమలు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.