వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్
'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని సమీక్షించేందుకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్సీలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ నాయకులకు రెండు కార్యక్రమాలను ఆయన ప్రకటించారు. ప్రభుత్వ పరంగా 'జగనన్న ఆరోగ్యసురక్ష', వైసీపీ పరంగా 'ఏపీకి మళ్లీ జగనే ఎందుకు కావాలి' అనే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఏపీ శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రజల్లోకి వెళ్లాలన్నారు. నాలుగేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రానున్న రెండు నెలల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
ఈ ఆరు నెలలు చాలా కీలకం: జగన్
వచ్చే ఎన్నికల్లో కొందరి ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం కుదరదని.. కానీ వారికి తగిన గౌరవం దక్కుతుందని సీఎం జగన్న అన్నారు. తన నిర్ణయాలను అందరూ పెద్ద మనసుతో ఒప్పుకోవాలని చెప్పారు. గడప గడపకూ మన ప్రభుత్వం వంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు చేసిన దానికంటే, వచ్చే ఆరు నెలల్లో చేసే పనులు చాలా కీలకమన్నారు. ఎన్నికల ముందు ఎలా పని చేయబోతున్నామన్నది చాలా ముఖ్యమన స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తాము ప్రణాళికలు, వ్యూహాలను రూపొందిస్తున్నామని, వాటిని కచ్చితంగా అమలు చేయాలని సీఎం జగన్ అన్నారు. సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కోరారు.