Chacha e morto: సంజయ్ మరణవార్త విని కన్నీటిపర్యంతమైన రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయాల ప్రభావం నాయకుల జీవితాలకే పరిమితం కాలేదని, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చిన్నారులైన పిల్లల జీవితాలపైనా పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. 1977లో ఇందిరా గాంధీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తమ కుటుంబానికి ఎదురైన అనుభవాలను ఆమె తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో వివరించారు. అప్పటివరకు తమ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న చాలామంది వ్యక్తులు క్రమంగా దూరమయ్యారని తెలిపారు. ఈ పరిణామాలు చిన్నారులైన రాహుల్, ప్రియాంకలను తీవ్రంగా బాధించాయని వెల్లడించారు.
వివరాలు
రాహుల్ నేర్చుకున్న తొలి బాధాకరమైన పాఠం అదే..
1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓటమి పాలవడంతో తమ కుటుంబమంతా బాధలో మునిగిపోయిందని సోనియా గుర్తు చేసుకున్నారు.
అదే సమయంలో రాహుల్ పుట్టినరోజు కావడంతో ఇంట్లోనే అతడి స్నేహితులను పిలిచి చిన్న వేడుక ఏర్పాటు చేశామని తెలిపారు.
అయితే, ఆ వేడుకకు రాహుల్ ప్రాణస్నేహితుడు సిద్ధార్థ్ మినహా మరెవరూ రాలేదని వెల్లడించారు.
మొదట ఏదైనా పొరపాటు జరిగి పిల్లలు రాలేదేమోనని భావించి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశామని, కానీ ఉద్దేశపూర్వకంగానే తమ పిల్లలను ఇంటికి పంపలేదని తెలిసి ఆశ్చర్యపోయామని పేర్కొన్నారు.
ఏడేళ్ల చిన్నారి స్నేహబంధంపై కూడా రాజకీయాల ప్రభావం పడటం తమను తీవ్రంగా కలచివేసిందన్నారు.
వివరాలు
ఇందిరా గాంధీ విజయం సాధించిన తర్వాతే పరిస్థితుల్లో మార్పు
ఈ ఘటనతో రాహుల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, అతడిని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఓదార్చారని గుర్తు చేసుకున్నారు.
మానవ సంబంధాల విషయంలో రాహుల్‌కు ఎదురైన తొలి బాధాకరమైన అనుభవం అదే అని వివరించారు.
ఈ ప్రభావం అక్కడితో ఆగలేదని సోనియా తెలిపారు. పాఠశాలలోనూ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గురించి తోటి విద్యార్థులు చేసే వ్యాఖ్యలు విని రాహుల్, ప్రియాంక బాధపడేవారని చెప్పారు.
ఆ సమయంలో పిల్లలకు ధైర్యం చెబుతూ తమ కుటుంబ సభ్యులు దేశం కోసం ఎంతగా కష్టపడ్డారో వివరించేదాన్నని తెలిపారు.
1978 నవంబర్‌లో చిక్కమగళూరు ఉప ఎన్నికలో ఇందిరా గాంధీ విజయం సాధించిన తర్వాతే పరిస్థితుల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు.
వివరాలు
సంజయ్ మరణం మా కుటుంబానికి తీరని లోటు..
1980 జూన్‌లో పిల్లలకు వేసవి సెలవులు రావడంతో సోనియా, రాజీవ్ గాంధీ తమ పిల్లలు రాహుల్, ప్రియాంకతో కలిసి ఇటలీ వెళ్లారు.
అక్కడ ఓర్బాస్సానోలోని సోనియా తల్లిదండ్రుల వద్ద పిల్లలను ఉంచి, దంపతులిద్దరూ ఫ్లోరెన్స్ ప్రాంతానికి వెళ్లారు.
జూన్ 23న సోనియా తల్లికి దిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి చెబుతున్న విషయం అర్థం కాకపోవడంతో ఆమె ఫోన్‌ను పదేళ్ల రాహుల్‌కు ఇచ్చారు.
ఆ ఫోన్ చేసింది ఇందిరా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. ధావన్. విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించినట్లు ఆయన రాహుల్‌కు తెలిపారు.
వివరాలు
'బాబాయ్ చనిపోయాడు'
ఈ వార్త విన్న రాహుల్ తొలుత నమ్మలేకపోయాడని సోనియా గుర్తు చేసుకున్నారు.
వెక్కివెక్కి ఏడుస్తూ 'బాబాయ్ చనిపోయాడు' అంటూ ఇటాలియన్ భాషలో పదేపదే చెప్పాడని వెల్లడించారు.
ఈ విషయం తెలిసిన రాజీవ్ గాంధీ కూడా షాక్‌కు గురై నిశ్చేష్టులయ్యారని తెలిపారు.
ఆ సమయంలో రాజీవ్, రాహుల్‌లను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదని వివరించారు.
వివరాలు
సంజయ్ గాంధీని హెచ్చరించిన రాజీవ్
ఇటలీ వెళ్లడానికి ముందే విమానం నడిపే విషయంలో సంజయ్ గాంధీని రాజీవ్ హెచ్చరించారని సోనియా వెల్లడించారు.
తగిన ప్రాథమిక శిక్షణ లేకుండా విమానం నడిపేందుకు తొందరపడవద్దని సూచించినప్పటికీ సంజయ్ ఆ సలహాను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
విమానం నడుపుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
సంజయ్ మరణించే సమయానికి ఆయన భార్య మేనకా గాంధీ వయసు కేవలం 23 ఏళ్లేనని, అప్పటికి మూడు నెలల వయసున్న కుమారుడు వరుణ్ గాంధీ తండ్రిని కోల్పోవడం తమ కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయిందని సోనియా తన ఆత్మకథలో వివరించారు.