Loading...
Maharashtra: దెయ్యాలు తిరుగుతున్నాయనే భయంతో హాస్టల్‌ నుంచి వెళ్లిపోయిన 608 మంది విద్యార్థులు

Maharashtra: దెయ్యాలు తిరుగుతున్నాయనే భయంతో హాస్టల్‌ నుంచి వెళ్లిపోయిన 608 మంది విద్యార్థులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్‌లో దెయ్యాల వదంతులు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశాయి. హాస్టల్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగడంతో ఏకంగా 608 మంది విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయి ఇళ్లకు చేరుకున్నారు. అర్ధరాత్రి విచిత్రమైన శబ్దాలు అమరావతి జిల్లాలోని డోమా ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్‌లో అర్ధరాత్రి వేళ విచిత్రమైన, భయానక శబ్దాలు వినిపిస్తున్నాయని కొంతమంది బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్‌లో దెయ్యాలు సంచరిస్తున్నాయని, అతీంద్రియ శక్తులు ఉన్నాయనే వార్తలు వ్యాపించాయి. ఈ ప్రచారంతో విద్యార్థుల్లో భయం మరింత పెరిగింది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్‌ను విడిచిపెట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మొత్తం 608 మంది విద్యార్థులు హాస్టల్‌ నుంచి వెళ్లిపోయి తమ ఇళ్లకు చేరుకున్నట్లు సమాచారం.

వివరాలు 

మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తింపు

అయితే విద్యార్థులు చెబుతున్న అనుభవాల వెనుక దెయ్యాలు, అతీంద్రియ శక్తులు లేవని హాస్టల్‌ యాజమాన్యం తెలిపింది.

ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యగా పేర్కొంది. ఫిర్యాదు చేసిన బాలికలను మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించినట్లు వెల్లడించింది.

విద్యార్థినులు తీవ్రమైన హిస్టీరియా వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్యులు తెలిపారని హాస్టల్‌ యాజమాన్యం పేర్కొంది.

ప్రస్తుతం వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

వదంతులు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి

విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తగ్గించేందుకు, వారి మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హాస్టల్‌ యాజమాన్యం తెలిపింది.

ఈ ఘటన కారణంగా విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తున్నామని పేర్కొంది.

అలాగే హాస్టల్‌లో దెయ్యాలు లేదా అతీంద్రియ శక్తులు ఉన్నాయంటూ వదంతులు వ్యాప్తి చేయవద్దని యాజమాన్యం కోరింది.

విద్యార్థుల భయాందోళనలను తొలగించి, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

ADVERTISEMENT