Maharashtra: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. స్పీకర్‌కు బాంబై హైకోర్టు నోటీసులు
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. అనర్హత వేటు ఎందుకు వేయకూడదో సమాధానం చెప్పాలని స్పీకర్ నార్వేకర్‌తో పాటు ఉద్ధవ్ ఠాక్రే గ్రూపులోని 14 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన డివిజన్ బెంచ్ మహారాష్ట్ర లెజిస్లేచర్ సెక్రటేరియట్‌కు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ప్రతివాదులందరినీ ఆదేశించింది. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 8కి బెంచ్ వాయిదా వేసింది.
స్పీకర్ ఉత్తర్వులకు చట్టబద్ధత లేదు: షిండే వర్గం
ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై షిండే నేతృత్వంలోని శివసేన చీఫ్ విప్ భరత్ గోగవాలే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆయా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ నర్వేకర్ జనవరి 10న జారీ చేసిన ఉత్తర్వులకు చట్టబద్ధత లేదని గోగవాలే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి)కి చెందిన 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని, దానిని స్పీకర్ ఉత్తర్వులను రద్దు చేయాలని గోగావాలే హైకోర్టును కోరారు. ఈ క్రమంలో ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే, షిండేతో సహా ఆయన శిబిరంలోని 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న ఠాక్రే వర్గం పిటిషన్‌ను కూడా స్పీకర్ తిరస్కరించారు.