Sridhar Vembu: అమెరికా మనల్ని వద్దనుకుంటోంది.. భారత టెక్కీలు స్వదేశానికి రావాలి: శ్రీధర్ వెంబు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో గ్రీన్‌కార్డు ప్రక్రియకు సంబంధించి భారతీయ ఐటీ కంపెనీలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్కీలు స్వదేశానికి తిరిగిరావాలని పిలుపునిచ్చారు. అమెరికా సాంకేతిక అభివృద్ధిలో భారతీయులు ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అయినప్పటికీ, అక్కడి ప్రజల్లో మెజారిటీ వర్గం ఇప్పుడు భారతీయులను కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భారత్‌కు తిరిగొచ్చి దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.
వివరాలు
కొత్త భవిష్యత్తుకు నాందిగా చూడాలి
అమెరికాలో వీసాలపై పనిచేస్తూ ఎంతో కష్టపడి జీవితాలను నిర్మించుకున్న భారతీయులు.. ఇప్పుడు వాటిని వదులుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటుండటం బాధాకరమని వెంబు పేర్కొన్నారు.
అయితే, ఈ పరిణామాన్ని కేవలం ప్రతికూల పరిస్థితిగా కాకుండా కొత్త భవిష్యత్తుకు నాందిగా చూడాలని సూచించారు.
'తిరిగి రండి.. మన దేశాన్ని మనమే నిర్మించుకుందాం' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా భారతీయ టెక్కీలకు పిలుపునిచ్చారు.
వివరాలు
భారత ఐటీ సంస్థలపై అమెరికా ఆంక్షలు
అమెరికా కార్మిక శాఖ ఇటీవల పలు భారతీయ ఐటీ సంస్థలతో పాటు అంతర్జాతీయ కంపెనీలను ప్రోగ్రాం ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్ (పీఈఆర్‌ఎం) పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమం నుంచి సస్పెండ్ చేసింది.
ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌తో పాటు కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు ఉన్నాయి.
అమెరికాలో కంపెనీల ద్వారా గ్రీన్‌కార్డు పొందే ప్రక్రియలో పీఈఆర్‌ఎం కీలక పాత్ర పోషిస్తుంది.
వివరాలు
పీఈఆర్‌ఎం విధానం దుర్వినియోగం చేశారని ఆరోపణలు
అమెరికాలో విదేశీ ఉద్యోగులను శాశ్వతంగా నియమించుకునే ముందు.. సంబంధిత ఉద్యోగానికి అర్హులైన అమెరికా కార్మికులు అందుబాటులో లేరని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియలో భాగంగానే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ పొందాలి.
అయితే, సంబంధిత సంస్థలు పీఈఆర్‌ఎం విధానాన్ని దుర్వినియోగం చేశాయని అమెరికా కార్మిక శాఖ ఆరోపించింది.
కొత్త దరఖాస్తులను స్వీకరించబోమని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపైనా తదుపరి చర్యలు చేపట్టబోమని కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సాండర్లింగ్ ప్రకటించారు.
వివరాలు
హెచ్-1బీ వీసాలపై నేరుగా ప్రభావం ఉండదు
ఈ సస్పెన్షన్ కారణంగా ప్రభావిత సంస్థలు కొత్త పీఈఆర్‌ఎం దరఖాస్తులను దాఖలు చేయలేవు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియ కూడా నిలిచిపోతుంది.
అయితే, ఈ చర్యలతో హెచ్-1బీ వీసాలు ఆటోమేటిక్‌గా రద్దు కావు.
ఆ వీసాలపై ఉద్యోగులను నియమించుకోవడంపైనా నేరుగా నిషేధం విధించినట్లు కాదు.
అంటే, గ్రీన్‌కార్డు ప్రక్రియపై ఆంక్షలు విధించినప్పటికీ, హెచ్-1బీ వీసాలపై వాటి ప్రభావాన్ని వేరుగా చూడాల్సి ఉంటుంది.
వివరాలు
భారతీయులు భారత్‌కు తిరిగిరావాలని..
అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగిరావాలని శ్రీధర్ వెంబు పిలుపునివ్వడం ఇదే తొలిసారి కాదు.
ఈ ఏడాది మేలోనూ అమెరికా గ్రీన్‌కార్డు విధానంలో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో వీసాలపై అక్కడ పనిచేస్తున్న భారతీయులు భారత్‌కు తిరిగిరావాలని కోరారు.
తాజాగా భారతీయ ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయన మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారతీయ టెక్కీలు స్వదేశానికి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.