MK Stalin: టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ ఫైర్.. గద్దె దించేందుకు సిద్ధం కావాలంటూ పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం తమ మాజీ కూటమి భాగస్వాముల మద్దతుతోనే కొనసాగుతోందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ వ్యాఖ్యానించారు. గతంలో డీఎంకే విజయానికి కృషి చేసిన కొన్ని మిత్రపక్షాల నేతలు ప్రస్తుతం టీవీకేలో చేరాలనే అభిప్రాయాన్ని తనకు వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. "ఆ నాయకులు టీవీకేలో చేరాలనుకోవడం వారి ప్రజాస్వామ్య హక్కు. దాన్ని నేను గౌరవించాను. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడకూడదని, రాష్ట్రపతి పాలనకు దారితీసే పరిస్థితులు రావద్దని మేము భావించామని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడం తమ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
త్వరలోనే డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుంది
అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. "త్వరలోనే డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆశీర్వాదంతో తమిళనాడులో మరోసారి డీఎంకే ప్రభుత్వం ఏర్పడుతుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు చారిత్రాత్మక ఫలితాలను నమోదు చేశాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు డీఎంకే కూటమి మొత్తం 73 స్థానాలు గెలుచుకుంది. ఇందులో డీఎంకే 59, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఐ(ఎం) 2, వీసీకే 2, ఐయూఎంఎల్ 2, డీఎండీకే 1 స్థానం దక్కించుకున్నాయి.
వివరాలు
53 స్థానాలకే ఏఐఏడీఎంకే కూటమి పరిమితం
అదే సమయంలో ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాలకే పరిమితమైంది. ఆ కూటమిలో ఏఐఏడీఎంకే 47, పీఎంకే 4, బీజేపీ 1, ఏఎంఎంకే 1 స్థానం గెలుచుకున్నాయి. 234 సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాల మెజారిటీని ఏ ఒక్క పార్టీ కూడా సాధించలేకపోయింది. దీంతో ఇతర పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే, డీఎంకే పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.