Supreme Court: ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.. వైకాపా పిటిషన్ తిరస్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఎన్నికలకు ముందు 'సర్' ప్రక్రియను పూర్తి చేయాలంటూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం ఆరు వారాల్లోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు 'సర్' ప్రక్రియ పూర్తయితే కొత్త జాబితాను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఒకవేళ అప్పటిలోగా ఆ ప్రక్రియ పూర్తికాకపోతే పాత జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.
వివరాలు
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు కల్పించడం ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
వివరాలు
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ఎక్కడ ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ పరిణామంతో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు.