Rajasthan: ప్యాసింజర్ రైలు వెళ్లిన 45 నిమిషాలకే పేలుడు.. భారత్-పాక్ సరిహద్దులో కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. శ్రీగంగానగర్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. ప్రయాణికుల రైలు వెళ్లిన కొద్ది నిమిషాలకే పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. 50 జీబీ పాయింట్ సమీపంలో రాత్రి సమయంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. దీని ధాటికి రైల్వే ట్రాక్‌కు ఆధారంగా ఉన్న రెండు కాంక్రీట్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. అక్కడ సుమారు రెండు అడుగుల లోతులో గుంత ఏర్పడింది. పేలుడు శబ్దం తమకు వినిపించిందని సమీప ప్రాంతాల ప్రజలు మీడియాకు తెలిపారు.
వివరాలు
ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకున్నారా?
సమాచారం అందుకున్న భద్రతా బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యాంటీ టెర్రరిజం బృందాలు, బాంబు నిర్వీర్య బృందాలు అక్కడ తనిఖీలు చేపట్టాయి.
అనూప్‌గఢ్ జంక్షన్ నుంచి ప్రయాణికుల రైలు బయల్దేరిన 45 నిమిషాల తర్వాత ఈ పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
రైలు వెళ్లిన తర్వాత పేలుడు జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అయితే ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడుకు పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల పాకిస్థాన్ సరిహద్దులోని శ్రీగంగానగర్ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధాలు, ఆర్డీఎక్స్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఆ ఘటనకు, తాజా పేలుడుకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని గంగానగర్ ఎస్పీ వెల్లడించారు.