Tamil Nadu rain: తమిళనాడులో భారీ వర్షాలు,వరదలు..10 మంది మృతి,సహాయ శిబిరాలకు 17,000 మంది..
గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా మంగళవారం తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తప్పుడు అంచనాలు వేసిందని చీఫ్ సెక్రటరీ చెప్పారు. తిరునెల్వేలి, టుటికోరిన్ జిల్లాల్లో వర్షాల కారణంగా 10 మంది చనిపోగా, గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో కొందరు మరణించారని చీఫ్ సెక్రటరీ తెలిపారు. దక్షిణాది జిల్లాలు, ప్రత్యేకించి తిరునల్వేలి,టుటికోరిన్‌లలో రికార్డు స్థాయిలో వర్షపాతం, వరదలు నమోదయ్యాయి.
రెస్క్యూ,రిలీఫ్ ఆపరేషన్‌లో 1,343 మంది
నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో సహా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన దాదాపు 1,343 మంది సిబ్బంది రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 160 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చెయ్యగా, దాదాపు 17,000 మందిని ఈ రిలీఫ్ క్యాంపుల్లో ఉంచారు. దాదాపు 34 వేల ఫుడ్ ప్యాకెట్లను ప్రజలకు సరఫరా చేశారు. ఇప్పుడు కూడా నీటి మట్టం తగ్గకపోవడంతో అధికారులు కొన్ని గ్రామాలకు చేరుకోలేకపోతున్నామని చీఫ్ సెక్రటరీ చెప్పారు. తొమ్మిది హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి, వాటి ద్వారా 13,500 కిలోల ఆహారాన్ని ఒంటరిగా ఉన్న బాధితులకు సరఫరా చేశారు.
పాఠశాలలు, కళాశాలలకు సెలవు
భాధిత ప్రజలకు నిత్యావసరాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తిరునెల్వేలిలో 64,900 లీటర్లు,టుటికోరిన్‌లో 30,000 లీటర్లు పాలను సరఫరా చేశామన్నారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో దాదాపు 323 పడవలు చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు రంగంలోకి దింపామని,పొరుగు జిల్లాల నుంచి మరికొంత మంది సిబ్బందిని సహాయక చర్యలకు రప్పిస్తామని చెప్పారు. భారీ వర్షాల దృష్ట్యా తిరునెల్వేలి, టెన్'కాశి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా తుత్తుకుడి జిల్లాకు కూడా సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ వర్షం కారణంగా బుధవారం కూడా రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. దక్షిణ రైల్వే రద్దు చేసిన/పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. ఇండియన్ ఆర్మీ రెస్క్యూ టీమ్ శ్రీవైకుంటం చేరుకుంది.