
Tavasya:భారత నౌకాదళంలోకి 'తవస్య' ప్రవేశం.. సముద్రంలో భారత శక్తిని చూపనున్న యుద్ధనౌక
ఈ వార్తాకథనం ఏంటి
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జిఎస్‌ఎల్) ప్రాజెక్ట్ 1135.6 కింద రెండో ఫాలో-ఆన్ యుద్ధనౌక 'తవస్య'ను శనివారం ప్రారంభించింది.
ఈ కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ నిర్వహించారు. భారత నావికాదళ స్వావలంబన దిశగా ఇది ఒక ప్రధానమైన ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో తవస్య కీలక పాత్రను పోషించనుంది. 'తవస్య' అనే పేరు మహాభారతంలోని భీముడి పురాణ గదను సూచిస్తుంది.
నేవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ యుద్ధనౌక భారత నావికాదళం యొక్క అపరాజిత స్పూర్తిని, పెరుగుతున్న శక్తిని ప్రతిబింబిస్తుంది.
ఉపరితల, భూగర్భ, వాయు పోరాటాలకు అనువైన ఈ నౌక, అత్యాధునిక సాంకేతికతతో కూడిన శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలతో సన్నద్ధమైంది.
Details
మొదటి నౌక 'త్రిపుట్' 2024లో ప్రారంభం
2019 జనవరిలో రక్షణ మంత్రిత్వ శాఖ, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ మధ్య ప్రాజెక్ట్ 1135.6 కింద ఫాలో-ఆన్ ఫ్రిగేట్ల నిర్మాణ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం రెండు యుద్ధనౌకలను నిర్మించడానికి నిర్ణయించారు. మొదటి నౌక 'త్రిపుట్' ను 2024 జూలై 24న ప్రారంభించగా, రెండవ నౌక 'తవస్య' తాజాగా ప్రారంభించారు.
త్రిపుట్, తవస్య యుద్ధనౌకలు దాదాపు 125 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల డ్రాఫ్ట్, 3,600 టన్నుల బరువుతో రూపొందించారు. వీటి గరిష్ట వేగం 28 నాట్లుగా ఉంది.
తవస్య, త్రిపుట్ నౌకలు అధిక శాతం స్వదేశీ పరికరాలు, ఆయుధాలు, సెన్సార్లను కలిగి ఉన్నాయి. భారతీయ తయారీ యూనిట్ల ద్వారా వీటి నిర్మాణం పూర్తయింది.