LOADING...
SSC Public Exams 2025: తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!
తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!

SSC Public Exams 2025: తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రేపటి నుంచి (మార్చి 21) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల మాదిరిగానే పదో తరగతి పరీక్షలకు కూడా ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా, 9:35 గంటల వరకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు అనుమతి ఉంటుందని, అయితే 9:35 తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. హాల్‌టికెట్లు ఇప్పటికే విడుదల చేశామని, విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

వివరాలు 

పరీక్షల ముఖ్యాంశాలు 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. కాంపోజిట్ పేపర్లకు పరీక్ష రాసే విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు ముఖ్య సూచనలు 24 పేజీల బుక్‌లెట్: ఈ ఏడాది తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను అందించనున్నారు. విద్యార్థులు అందులోనే సమాధానాలు రాయాలి. అవసరమైనప్పుడు అదనపు పేజీలు కూడా ఇస్తారు. ప్రశ్నపత్రంపై QR కోడ్: ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు, ఈసారి తొలిసారిగా ప్రతి ప్రశ్నపత్రంపై QR కోడ్ ముద్రించనున్నారు. యూనిక్ నంబర్: ఒక్కో ప్రశ్నపత్రంపై ప్రత్యేకమైన యూనిక్ నంబర్‌ను ముద్రించనున్నారు. ప్రశ్నపత్రంలోని అన్ని పేజీల్లో అదే నంబర్ ఉంటుంది.

వివరాలు 

విద్యార్థులకు ముఖ్య సూచనలు

విభాగాల వారీగా సైన్స్ పరీక్షలు: భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను వేర్వేరుగా రెండు రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు మాత్రమే జరుగుతాయి. గ్రాఫ్ పేపర్: గణితం పరీక్ష రోజున గ్రాఫ్ పేపర్‌ను విడిగా అందిస్తారు. సీసీ కెమెరాల నిఘా: సీడీవో గదుల్లో ప్రశ్నపత్రాల బండిల్స్‌ను సీసీ కెమెరాల నిఘాలోనే తెరవనున్నారు. సహాయ కేంద్రం: పరీక్షలకు సంబంధించిన సందేహాలు, సమస్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు 040-23230942 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.