Telangana: 22ఏ జాబితాపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏదో ఒక లింక్ డాక్యుమెంట్ ఉంటే చాలు
ఈ వార్తాకథనం ఏంటి
దశాబ్దాలుగా ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారిన 22ఏ నిషేధిత జాబితా సమస్యకు తెలంగాణ ప్రభుత్వం కీలక పరిష్కారం చూపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా కాలంగా 22ఏ జాబితాలో కొనసాగుతున్న ఇళ్లు,ప్లాట్లు,ఫ్లాట్లకు నిబంధనల మేరకు విముక్తి కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న శాసనసభలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహ, వివేక్ తదితరులు సమావేశమయ్యారు. 22ఏ జాబితాకు సంబంధించిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి అనుగుణంగా రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాలు
300 కాలనీల్లో 1.41 లక్షల ఆస్తులకు ఊరట
ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైదరాబాద్, పరిసర జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 కాలనీల్లోని 1.41 లక్షల ఇళ్లు, ప్లాట్లకు ప్రయోజనం కలగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇందులో రంగారెడ్డి జిల్లాలో 44 కాలనీలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 65 కాలనీలు ఉన్నట్లు సమాచారం.
కోర్టు కేసుల్లో వచ్చిన తీర్పులు, భూముల వేలం, క్రమబద్ధీకరణ వంటి ప్రక్రియల తర్వాత ఏర్పడిన పలు కాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు, ఖాళీ స్థలాలు కొనుగోలు చేసినవారికి సంబంధించిన వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో సకాలంలో అప్‌డేట్ కాలేదు.
దీంతో ఆ ఆస్తులు ప్రభుత్వ భూముల జాబితాల్లోనే కొనసాగాయి.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గత ఏడాది 22ఏ జాబితాను ప్రభుత్వం అప్‌డేట్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
వివరాలు
12 రకాల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం
అయితే ఈ ప్రక్రియలో కొన్ని నివాసాలు, లేఅవుట్లు కూడా 22ఏ జాబితాలో చేరిపోయాయి.
దీంతో ఆయా ప్రాంతాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిపై ఆస్తుల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
22ఏ జాబితా కారణంగా ఎదురవుతున్న సమస్యను ప్రభుత్వం ప్రత్యేక అంశంగా పరిగణించింది.
శాసనసభ సమావేశాల్లో దీనిపై చర్చించింది. మొత్తం 12 రకాల సమస్యలు ఉన్నట్లు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు ప్రారంభించింది.
తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయా సమస్యలకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలను ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివరాలు
అనుమతులున్న ఆస్తులకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి చట్టబద్ధమైన అనుమతులు తీసుకుని అభివృద్ధి చేసిన ఖాళీ స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్లకు నిర్దేశిత నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వనున్నారు.
రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కొన్ని కీలక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొందినట్లు నిర్ధారించే పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
అలాగే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేదా సంబంధిత స్థానిక సంస్థలు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే లేఅవుట్, భవన నిర్మాణం, అపార్ట్‌మెంట్ నిర్మాణ అనుమతులు ఉండాలి.
వివరాలు
జిల్లా స్థాయిలో కమిటీలు
అనుమతుల తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏదైనా ఒక లింక్ డాక్యుమెంట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పత్రాల ఆధారంగా అర్హత ఉన్న ఆస్తులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఆస్తుల విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. సంబంధిత రికార్డులు,అనుమతులు,భూమి స్వభావం తదితర అంశాలను పరిశీలించి అర్హత ఉన్న కేసులపై నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించారు.
అయితే కోర్టుల్లో విచారణలో ఉన్న అంశాలు మాత్రం న్యాయస్థానాల తుది తీర్పులకు లోబడి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంటే న్యాయపరమైన వివాదాలు ఉన్న భూముల విషయంలో కోర్టుల నిర్ణయమే తుది ఆధారంగా ఉంటుంది.
వివరాలు
ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కారం: మంత్రి పొంగులేటి
ఏళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 22ఏ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అనుమతులు పొందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఇక ఆటంకం ఉండదని మంత్రి తెలిపారు.
అయితే దరఖాస్తుదారులు తమ ఆస్తికి సంబంధించి ఏదైనా ఒక లింక్ డాక్యుమెంట్‌ను చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని 64 కాలనీల్లో ఇళ్ల క్రమబద్ధీకరణకు జీఓ 118 జారీ చేసినట్లు మంత్రి గుర్తుచేశారు.
అలాగే సింగరేణి కార్మికుల ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం జీఓ 76ను కూడా ఇప్పటికే జారీ చేసినట్లు తెలిపారు.
వివరాలు
అన్ని భూములను ఒకే కోణంలో చూడబోం
22ఏ జాబితాలో ఉన్న అన్ని భూములను ఒకే గాటన కట్టకుండా ఒక్కో కేసును విడిగా పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
భూమి స్వభావం, అందుబాటులో ఉన్న రికార్డులు, చట్టబద్ధమైన అనుమతులు, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
అర్హత ఉన్న ఆస్తులకు సత్వర పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
దీంతో 22ఏ జాబితా కారణంగా ఇన్నాళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన అనేక ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల యజమానులకు ఊరట లభించే అవకాశం ఏర్పడింది.
అయితే సంబంధిత అనుమతులు, రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే అర్హత ఉన్న ఆస్తులకు నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించనున్నారు.