Supreme Court: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ వెనకడుగు
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసును ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ రూపంలో మళ్లీ దాఖలు చేయాలని సీజేఐ సూచించారని ఆయన తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకే రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Details
ఈ కేసుపై విచారణ
ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం నిర్మించదలిచిన ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలతోనే రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. గత సోమవారం కూడా ఈ కేసుపై విచారణ జరిగిందని, నేడు తెలంగాణ ప్రభుత్వం తరఫున మరికొన్ని అదనపు వాదనలు వినిపించామని చెప్పారు. ఈ వ్యవహారంలో కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగించకూడదనే అంశమే ప్రధానమైనదని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం గతంలో అనేకసార్లు నీటి కేటాయింపుల ఉల్లంఘనలకు పాల్పడిందని, వాటిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అలాగే స్టాప్ వర్క్ ఆర్డర్‌ను అమలు చేయడం లేదన్న విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేశామని అన్నారు.
Details
ఏపీకి 484.5 టీఎంసీల నీరు మాత్రమే
ఏపీకి 484.5 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారని కానీ అంతకన్నా ఎక్కువగా వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదీ బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అదే విధంగా, ముందుగా డిజైన్ చేసిన ప్రాజెక్టుకు మించి ఎలాంటి అదనపు పనులు చేయడానికి వీల్లేదని, పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్ ఫామ్‌కు మించి మార్పులు చేయరాదని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పష్టంగా వాదనలు వినిపించినట్లు ఆయన వెల్లడించారు.