Telangana: ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ జాబితా సిద్ధం.. అధిష్ఠానానికి ఆరుగురి పేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆరుగురు ఆశావహులతో కూడిన జాబితాను టీపీసీసీ సిద్ధం చేసి కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించింది. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి ముగ్గురి పేర్లను టీపీసీసీ ప్రతిపాదించింది. ఓసీ, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరి పేరును ఎంపిక చేసి అధిష్ఠానానికి పంపించింది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, సామ రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరిలో ఒకరిని కాంగ్రెస్ అధిష్ఠానం తుది అభ్యర్థిగా ఖరారు చేయనుంది.
వివరాలు
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి జాబితా సిద్ధం
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి కూడా ముగ్గురి పేర్లతో టీపీసీసీ జాబితా సిద్ధం చేసింది.
ఇందులో ఇద్దరు ఓసీ, ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలకు చోటు కల్పించింది.
ప్రస్తుత ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్, సూర్యాపేటకు చెందిన సర్వోత్తమ్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ పేర్లను అధిష్ఠానానికి పంపించింది.
వీరిలో ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది.
వివరాలు
టికెట్ ఎవరికి దక్కినా సహకరించాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.
టికెట్ ఎవరికి లభించినా మిగిలిన నేతలు, ఆశావహులు కలిసి పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతలను కోరనున్నారు.
అధిష్ఠానం అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించకముందే ఆశావహులతో టీపీసీసీ అధ్యక్షుడు సమావేశం కానున్నారు.