Loading...
Telangana: దసరా సంప్రదాయం పేరుతో పాలపిట్టలకు హాని చేస్తే చర్యలు.. అటవీశాఖ
దసరా సంప్రదాయం పేరుతో పాలపిట్టలకు హాని చేస్తే చర్యలు.. అటవీశాఖ

Telangana: దసరా సంప్రదాయం పేరుతో పాలపిట్టలకు హాని చేస్తే చర్యలు.. అటవీశాఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయదశమి సందర్భంగా పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో బంధించడం, ప్రదర్శించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని తెలంగాణ అటవీశాఖ స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అటవీ దళాల అధిపతి (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్) వినయ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాలపిట్టల సంరక్షణ, ప్రమాదకరమైన చైనా మాంజా నియంత్రణపై వినయ్ కుమార్ సమీక్షించారు. దసరా సందర్భంగా పాలపిట్టలను బంధించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వివరాలు 

పంజరాల్లో బంధించడం నేరం

విజయదశమి రోజు పాలపిట్టను చూడటం శుభసూచకమనే నమ్మకం చాలాకాలంగా కొనసాగుతోంది.

అయితే ఈ సంప్రదాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో బంధించి ప్రదర్శిస్తున్నారని వినయ్ కుమార్ తెలిపారు.

ఇలా చేయడం వల్ల పక్షులు తీవ్ర ఒత్తిడికి గురవుతాయని, ఆహారం తీసుకోకుండా బలహీనపడే అవకాశం ఉందని చెప్పారు.

చివరకు అవి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఏడాది దసరా సమయంలో పంజరాల్లో బంధించిన 28 పాలపిట్టలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని తిరిగి స్వేచ్ఛగా వదిలిపెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

పాలపిట్టలను పట్టుకుని బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరమని స్పష్టం చేశారు.

వివరాలు 

సహజ ఆవాసంలోనే పాలపిట్టను చూడాలి

విజయదశమి రోజు పాలపిట్టను చూడాలనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

తెలంగాణ సంస్కృతిలో పాలపిట్టకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

అయితే సంప్రదాయం ప్రకారం పాలపిట్టను దాని సహజ ఆవాసంలో స్వేచ్ఛగా ఎగురుతుండగా చూడాలి తప్ప.. పంజరంలో బంధించి చూడటం కాదని స్పష్టం చేశారు.

దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆలయాల వద్ద పాలపిట్టలను పంజరాల్లో ఉంచి ప్రదర్శించకుండా పర్యవేక్షించాలని అటవీశాఖ దేవాదాయశాఖ అధికారులకు సూచించింది.

ఎక్కడైనా పాలపిట్టలను బంధించి ఉంచినట్లు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

చైనా మాంజాపైనా కఠిన చర్యలు

సమావేశంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వినియోగించే ప్రమాదకరమైన చైనా మాంజా నియంత్రణపైనా అధికారులు చర్చించారు.

గాజు పొడి పూసిన ఈ మాంజా కారణంగా పక్షులు తీవ్రంగా గాయపడి మృతి చెందుతున్నాయని వినయ్ కుమార్ తెలిపారు.

కొన్ని సందర్భాల్లో మనుషులకు కూడా చైనా మాంజా ప్రాణాపాయాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో చైనా మాంజా అమ్మకాలు, నిల్వలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

పక్షుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చైనా మాంజాపై నిఘా పెంచాలని సూచించారు.

ADVERTISEMENT