Telangana: తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గల్ఫ్‌లో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. "ప్రవాసి ప్రజావాణి" పేరిట ఫిర్యాదులను స్వీకరించనుంది, అలాగే గురుకులాల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యతనిస్తుందని ప్రకటించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందిన కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎడారి దేశాలలో ఉన్న పరిస్థితులు,అక్కడి జీవిత సౌకర్యాలు,అప్పులు తీర్చలేక కుటుంబాలు పడుతున్న కష్టాలు తెలియని వారే ఉంటారు.. స్థానికంగా ఉపాధి కల్పించని ప్రభుత్వాలు, వలస కార్మికుల మృతదేహాలను కూడా రప్పించలేక పోతున్నారు. ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నా కష్టాన్ని చూసేవారు కొద్దిమందే ఉన్నారు.
కార్మిక సంక్షేమానికి తొలి అడుగు
ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ మరణించిన తెలంగాణ వలస కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 216 ద్వారా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఇలాంటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం గమనార్హం. ఇది లక్షల మంది గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడనుంది.
ఎవరికి వర్తిస్తుంది?
ఈ ఎక్స్‌గ్రేషియా బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి 7 గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికులకు వర్తించనుంది. 2023 డిసెంబర్ 7 లేదా ఆ తర్వాత చనిపోయిన కార్మికులపై ఇది అమలులోకి వస్తుంది. మరణానికి కారణం ఏదైనా ఈ పరిహారం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది, అంటే సహజ మరణం, ప్రమాదం, అనారోగ్యం లేదా ప్రమాదకర పరిస్థితుల్లో మరణించిన వారికి ఇది వర్తిస్తుంది.
పరిహారం కోసం దరఖాస్తు విధానం
ఈ ఎక్స్‌గ్రేషియా కోసం గల్ఫ్ ప్రాంతాల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు (జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులు) తమ స్థానిక జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు చేసుకోవాలి. మరణం జరిగిన తేదీ లేదా మృతదేహం స్వీకరించిన తేదీ నుంచి 6 నెలలలోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించాల్సిన సర్టిఫికెట్లు
మరణ ధృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) రద్దు చేసిన పాస్‌పోర్ట్ గల్ఫ్ లేదా ఇరాక్ దేశాల్లో పని చేసిన రుజువు (వర్క్ వీసా, ఉద్యోగ ఒప్పందం వంటి పత్రాలు) అర్హులైన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు తెలంగాణ ప్రభుత్వ సంకల్పం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల ఈ ఎక్స్‌గ్రేషియా పరిహారం, వారి భరోసా కల్పించేందుకు ఒక కీలక చర్యగా నిలుస్తుందని కాంగ్రెస్ NRI నేతలు అభిప్రాయపడుతున్నారు.