Special TET: తెలంగాణ ఇన్-సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్-సర్వీస్ టీచర్లకు ఉపయోగపడేలా ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ప్రతి ఏడాది నిర్వహించే రెండు సాధారణ టెట్ పరీక్షలకు అదనంగా, కేవలం ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం మరో రెండు ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఏటా జరిగే రెగ్యులర్ టెట్‌లతో పాటు ప్రత్యేక టెట్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జూన్ 3, 2026న అధికారిక మెమో విడుదల చేసింది. ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వివరాలు
ప్రతిపాదనలు, నివేదికలు సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం
ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి చేసిన విజ్ఞప్తులతో పాటు, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ (PRTU-TS), ది స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) తదితర ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం పరిశీలించింది. అలాగే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టెట్ చైర్మన్ సమర్పించిన ప్రతిపాదనలు, నివేదికలను కూడా సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక టెట్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, తదుపరి చర్యలను వెంటనే ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు సూచించింది.
వివరాలు
త్వరలోనే ప్రత్యేక టెట్ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత అవసరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా పదోన్నతులు పొందడం లేదా ఉద్యోగ సేవలను కొనసాగించడం కోసం టెట్ అర్హత సాధించాల్సిన ఉపాధ్యాయులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. సాధారణ అభ్యర్థులతో కలిసి పోటీ పడాల్సిన అవసరం లేకుండా, ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నందున వారు మరింత సౌకర్యవంతంగా పరీక్షలకు హాజరై అర్హత సాధించే అవకాశం పొందనున్నారు. చాలా కాలంగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించి ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే ప్రత్యేక టెట్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశముంది.