Page Loader
Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ 
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఇప్పటికే ఈ షెడ్యూల్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో, ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే ఈ ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వివరాలు 

ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 ఖర్చు

ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా, విద్యాశాఖ అధికారులు స్నాక్స్ మెనూ రూపొందించారు. ఆరు రకాల స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించడంతో, ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ స్నాక్స్ లో ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లీపట్టి, మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిగడ్డ పకోడీ, ఉల్లిగడ్డ శనగలు ఇచ్చేలా నిర్ణయించారు. ఈ నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఖతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు టీచర్లు మరియు ఎన్జీవోల ద్వారా స్నాక్స్ అందిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

 మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు.. 

ప్రస్తుతం అన్ని పాఠశాలల్లోనూ, ప్రత్యేక తరగతులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.