Telangana: గోదావరి-కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి: తెలంగాణ
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది. మంగళవారం దిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) 77వ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ అధికారులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. సాధారణ ఎజెండా అంశాలతోపాటు గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చించారు. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ఈఎన్సీలు (అడ్మిన్, ఓ అండ్ ఎం) కె.ప్రసాద్, మధుసూదన్‌రావు, ఎస్‌ఈ విజయ్‌కుమార్ సమావేశంలో పాల్గొని రాష్ట్ర వాదనను వినిపించారు. ఇచ్చంపల్లికి బదులుగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి-కావేరి అనుసంధానానికి నీటిని తరలించాలని ఏపీ ప్రతిపాదించింది.
వివరాలు
నదుల అనుసంధానం వల్ల..
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు లేదా పోలవరం-నల్లమల లింక్ ప్రాజెక్టుతో అనుసంధానించాలని సూచించింది.
కర్ణాటకలోని బెడ్తి-వార్ధా నదుల అనుసంధానం ద్వారా తుంగభద్ర ఉపనదీ పరీవాహక ప్రాంతానికి తరలించే నీటిలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా వాటా ఉంటుందని తెలిపింది.
ఈ ప్రతిపాదనలపై తెలంగాణ స్పందిస్తూ.. 2018లోనే ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిందని గుర్తుచేసింది.
నదుల అనుసంధానం వల్ల తెలంగాణ, కర్ణాటక వంటి ఎగువ రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌డబ్ల్యూడీఏ అప్పట్లో పోలవరం ప్రతిపాదనను తిరస్కరించిందని పేర్కొంది.
ఈ ఏడాది జూన్ 12న రాసిన లేఖలోనూ ఇచ్చంపల్లి ప్రాంతాన్నే అనుసంధాన ప్రాజెక్టుకు వేదికగా పేర్కొన్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లినే నీటి వనరుగా కొనసాగించాలని, ప్రత్యామ్నాయంగా సమ్మక్కసాగర్‌ను పరిశీలించాలని తెలంగాణ కోరింది.
వివరాలు
తెలంగాణకు అధిక ప్రయోజనాలు కల్పించాలి
గోదావరి-కావేరి అనుసంధానం ద్వారా తరలించే నీటిలో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని రాష్ట్రం కోరింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని స్పష్టం చేసింది.
కర్ణాటకకు కేటాయించిన 16 టీఎంసీల నీటిని ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేసింది.
కర్ణాటక ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి ఈ నీటిని తీసుకుంటే కృష్ణా నది దిగువకు వచ్చే ప్రవాహాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
తెలంగాణకు అధిక ప్రయోజనాలు కల్పించాలి
దీనివల్ల జూరాల ప్రాజెక్టుకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది.
బెడ్తి-వార్ధా నదుల అనుసంధానం వల్ల కృష్ణా బేసిన్‌లో తెలంగాణ కోల్పోయే నీటి వాటాకు సమానంగా గోదావరిలో అదనపు నీటిని కేటాయించాలని కోరింది.
ఈ షరతులకు అంగీకరిస్తే గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుకు తాము సానుకూలంగా ఉన్నామని తెలంగాణ స్పష్టం చేసింది.
ఈ సమావేశంలో తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారు.