Loading...
Borewell NOC Rules:  తెలంగాణలో ఎల్‌నీనో ప్రభావం.. బోర్‌వెల్‌ తవ్వకాలకు ఎన్‌వోసీ తప్పనిసరి
తెలంగాణలో ఎల్‌నీనో ప్రభావం.. బోర్‌వెల్‌ తవ్వకాలకు ఎన్‌వోసీ తప్పనిసరి

Borewell NOC Rules:  తెలంగాణలో ఎల్‌నీనో ప్రభావం.. బోర్‌వెల్‌ తవ్వకాలకు ఎన్‌వోసీ తప్పనిసరి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎల్‌నీనో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటకుండా చూడటంతో పాటు అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాగునీటి అవసరాలకు మినహా ఇతర పనుల కోసం శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2027 జులై చివరి వరకు అమల్లో ఉంటాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు జీవో 259 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు 

బోర్‌వెల్‌ తవ్వకాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

జీవో 259 ప్రకారం అపార్ట్‌మెంట్లు, గ్రూప్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులు, వాణిజ్య, పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ యూనిట్లు, బల్క్‌ వాటర్‌ సరఫరాదారులు కొత్త బోర్‌వెల్లు తవ్వాలంటే ముందుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) పొందాలి.

భూగర్భ జలాల వినియోగ నిబంధనలు-2023 ప్రకారం అనుమతులు తీసుకున్న తర్వాతే బోర్‌వెల్‌ తవ్వకాలు చేపట్టాలి.

అనుమతులతో బోర్‌వెల్‌ తవ్విన రిగ్‌ ఆపరేటర్‌ 15 రోజుల్లోగా నిర్ణీత అధికారికి వెల్‌ కంప్లీషన్‌ రిపోర్ట్‌ను సమర్పించాలి.

తవ్వకం పూర్తయిన బోర్‌వెల్‌ను సంబంధిత తహసీల్దార్‌ వద్ద తప్పనిసరిగా నమోదు చేయించాలి.

వివరాలు 

నిర్మాణ పనులకు భూగర్భ జలాల వినియోగంపై ఆంక్షలు

భవన నిర్మాణాలు, తోటల పెంపకం, ల్యాండ్‌స్కేపింగ్‌, రోడ్ల శుభ్రత వంటి అవసరాలకు భూగర్భ జలాలను వినియోగించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పనుల కోసం జలమండలి అందుబాటులోకి తెచ్చే శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది.

భూగర్భ జలాలను అక్రమంగా వెలికితీసినా, దుర్వినియోగం చేసినా వాల్టా (WALTA) చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ చర్యలకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

వివిధ శాఖలకు ప్రత్యేక బాధ్యతలు

భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా పలు ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించారు.

భూగర్భ జల శాఖ: నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ జల వనరులను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి.

మున్సిపల్‌ కార్పొరేషన్లు: భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను తప్పనిసరిగా అమలు చేయించాలి.

హైడ్రా: చెరువులు, కుంటలు, నీటి పునరుద్ధరణ ప్రాంతాలను ఆక్రమణలు, వ్యర్థాల డంపింగ్‌, కాలుష్యం నుంచి రక్షించాలి.

అలాగే తాగునీటి సరఫరా పైప్‌లైన్‌ వ్యవస్థలో లీకేజీలు, నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను కంటింజెన్సీ మానిటరింగ్‌ కమిటీకి అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ADVERTISEMENT