Telangana Police: చోరీ వాహనాన్ని పట్టించే యాప్.. 'టీజీ ఈ-టికెట్'తో సత్ఫలితాలు
ఈ వార్తాకథనం ఏంటి
ముచ్చటపడి వాహనం కొనుగోలు చేస్తాం. అందుకోసం రూ.లక్షలు ఖర్చు చేయడం లేదా బ్యాంకు రుణం తీసుకోవడం చేస్తాం. అలాంటి వాహనం చోరీకి గురైనా.. ఎక్కడైనా కనిపించకుండా పోయినా.. తిరిగి దొరికే వరకు యజమానులకు ఆందోళన తప్పదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు వాహనం చోరీ కావడం ఆర్థికంగా మరింత భారంగా మారుతుంది. ఇలాంటి సమస్యలకు త్వరగా పరిష్కారం చూపేలా తెలంగాణ పోలీసులు సాంకేతికతను వినియోగిస్తున్నారు. చోరీకి గురైన వాహనాలను సులభంగా గుర్తించేందుకు 'టీజీ ఈ-టికెట్' యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
వివరాలు
ఏటా 7-8 వేల వాహనాల చోరీ కేసులు
తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు 7-8 వేల వాహనాల చోరీ కేసులు నమోదవుతున్నాయి.
ఇందులో దాదాపు 90 శాతం ద్విచక్ర వాహనాలే ఉంటున్నాయి.
బైక్‌లను సులభంగా చోరీ చేసి విక్రయించేందుకు దొంగలు అంతర్రాష్ట్ర ముఠాలతో కలిసి పనిచేస్తున్నారు.
చోరీ చేసిన వాహనాలను రాష్ట్ర, జిల్లా సరిహద్దులు దాటించకముందే గుర్తించాలన్న ఉద్దేశంతో పోలీసులు 'టీజీ ఈ-టికెట్' యాప్‌ను రూపొందించారు.
వివరాలు
ఎఫ్‌ఐఆర్ ఉంటేనే గుర్తింపు
చోరీకి గురైన వాహనాన్ని ఈ యాప్ ద్వారా గుర్తించాలంటే ముందుగా పోలీసు కేసు నమోదు కావాలి.
వాహనం చోరీకి గురైనట్లు లేదా కనిపించకుండా పోయినట్లు గుర్తించిన వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత వాహనం వివరాలను సంబంధిత ఠాణా పరిధిలోని చోరీ వాహనాల డేటాబేస్‌లో నమోదు చేస్తారు.
వివరాలు
ఫొటో తీస్తే.. వెంటనే సమాచారం
ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగాల్లో పనిచేసే పోలీసులు ఉపయోగించే ట్యాబ్‌లలో ఈ యాప్‌ను ఇప్పటికే ఇన్‌స్టాల్ చేశారు.
వాహనాల తనిఖీల సమయంలో పోలీసులు ట్యాబ్ ద్వారా వాహనం ఫొటో తీసిన వెంటనే.. అది చోరీకి గురైన వాహనమైతే యాప్ గుర్తిస్తుంది.
వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది. ఆ వాహనం ఎక్కడ చోరీకి గురైంది.. ఏ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.. తదితర వివరాలు ట్యాబ్‌లో కనిపిస్తాయి.
సంబంధిత ఠాణాకు అప్పగింత
చోరీకి గురైన వాహనం గుర్తించిన వెంటనే పోలీసులు సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తారు.
అనంతరం వాహనాన్ని ఆ ఠాణాకు అప్పగిస్తారు. న్యాయస్థానంలో జరిగే ప్రక్రియ పూర్తయిన తర్వాత వాహనాన్ని అసలు యజమానికి అప్పగిస్తారు.
వివరాలు
హైదరాబాద్‌లో ప్రయోగాత్మక పరిశీలన
'టీజీ ఈ-టికెట్' యాప్ పనితీరును తొలుత హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
గస్తీ బృందాలకు అందించిన ట్యాబ్‌లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి తనిఖీలు నిర్వహించారు.
ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 90కి పైగా చోరీకి గురైన వాహనాలను పోలీసులు గుర్తించారు.
దీంతో చోరీ వాహనాలను వేగంగా గుర్తించడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతోందని పోలీసులు చెబుతున్నారు.