Telangana: తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు షాక్.. రూ.5,420 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు.. ఈఆర్‌సీ కీలక ఉత్తర్వులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై ట్రూ-అప్ ఛార్జీల భారం పడనుంది. మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, మిగిలిన రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలుకు అంచనాలకు మించి అయిన అదనపు వ్యయం,2023-24లో ఏర్పడిన రెవెన్యూ లోటును కలిపి మొత్తం రూ.7,635.22 కోట్లను వినియోగదారుల నుంచి ట్రూ-అప్ ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దక్షిణ, ఉత్తర తెలంగాణ డిస్కంలు 2025 నవంబరు 10న ఈఆర్‌సీకి పిటిషన్లు దాఖలు చేశాయి.
వివరాలు
సుప్రీంకోర్టు తీర్పుతో తుది నిర్ణయం
దీనిపై బహిరంగ విచారణ నిర్వహించిన కమిషన్.. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందాలని స్పష్టం చేసింది.
మిగిలిన రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర కనెక్షన్ల వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించింది.
రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ పిటిషన్లపై కొంతకాలం నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో టీజీఈఆర్‌సీని కోరింది.
దీంతో కమిషన్ ఉత్తర్వులను నిలిపివేసింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు తుది నిర్ణయం ప్రకటించింది.
వివరాలు
వచ్చే నెల నుంచే ట్రూ-అప్ వసూలు
ట్రూ-అప్ ఛార్జీల వసూలును వచ్చే నెల నుంచి జారీ చేసే విద్యుత్ బిల్లుల్లోనే ప్రారంభించాలని టీజీఈఆర్‌సీ డిస్కంలను ఆదేశించింది.
2022-23,2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి కనెక్షన్ ద్వారా జరిగిన విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఛార్జీలను వసూలు చేయాలి.
తొలి నెల అంటే నవంబరు బిల్లులో యూనిట్‌కు 30పైసలు,ఆ తర్వాత నుంచి యూనిట్‌కు 50పైసల చొప్పున వసూలు చేయాలని స్పష్టం చేసింది.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)పరిధిలోని వినియోగదారుల నుంచి 29 నెలలపాటు ఈ ఛార్జీలను వసూలు చేయనున్నారు.
ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 26 నెలలపాటు వసూలు కొనసాగుతుంది.
సాధారణ విద్యుత్ బిల్లుకు అదనంగా ఈ మొత్తం చెల్లించాల్సి ఉండటంతో వ్యవసాయేతర వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
వివరాలు
రైతులకు నేరుగా ట్రూ-అప్ ఛార్జీ లేదు
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం అమల్లో ఉన్న నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు నేరుగా ట్రూ-అప్ ఛార్జీలు విధించకూడదని టీజీఈఆర్‌సీ స్పష్టం చేసింది.
వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందాలని డిస్కంలకు సూచించింది.
దీంతో వ్యవసాయ వినియోగదారుల నుంచి ఈ ఛార్జీలను నేరుగా వసూలు చేయరు.
బిల్లులో విడిగా వివరాలు ఇవ్వాలి
ట్రూ-అప్ కింద వినియోగదారుడి నుంచి ఎంత మొత్తం వసూలు చేస్తున్నారో ప్రతి నెలా ఇచ్చే విద్యుత్ బిల్లులో ప్రత్యేకంగా చూపించాలని టీజీఈఆర్‌సీ ఆదేశించింది.
ఈ ఛార్జీ ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదో, ఆ నెలలో వినియోగించిన విద్యుత్ పరిమాణం ఎంత,దానికి వర్తించిన యూనిట్ రేటు ఎంత అనే వివరాలను కూడా బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి.
వివరాలు
ట్రూ-అప్ ఛార్జీ అంటే ఏమిటి?
ఇతర విద్యుత్ ఛార్జీలతో ట్రూ-అప్ మొత్తాన్ని కలిపి చూపకూడదని కమిషన్ స్పష్టం చేసింది.
ప్రతి ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఎంత విద్యుత్ కొనుగోలు చేయాలి,దాని కోసం ఎంత ఖర్చవుతుంది, వినియోగదారుల నుంచి ఎంత ఆదాయం వస్తుందనే అంచనాలను టీజీఈఆర్‌సీ పరిశీలించి ప్రతి ఏడాది మార్చిలో ఆమోదిస్తుంది.
అయితే వాస్తవ పరిస్థితుల్లో విద్యుత్ కొనుగోలు ఖర్చు అంచనాలను మించితే లేదా డిస్కంలకు వచ్చే ఆదాయం అంచనాల కంటే తగ్గితే లోటు ఏర్పడుతుంది.
ఆ లోటును తరువాతి దశలో సర్దుబాటు చేసుకునేందుకు వినియోగదారుల నుంచి వసూలు చేసే మొత్తాన్నే 'ట్రూ-అప్ ఛార్జీ' అంటారు.
ఇక్కడ 2022-23లో విద్యుత్ కొనుగోలుకు అంచనాలకు మించి అయిన ఖర్చును,2023-24లో ఏర్పడిన రెవెన్యూ లోటును కలిపి ట్రూ-అప్ ఛార్జీలుగా వసూలు చేయనున్నారు.
వివరాలు
ట్రూ-అప్ మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి: -
2022-23లో విద్యుత్ కొనుగోలుకు అదనంగా అయిన వ్యయం: రూ.5,186.29 కోట్లు
2023-24లో ఏర్పడిన రెవెన్యూ లోటు: రూ.2,448.93 కోట్లు
మొత్తం ట్రూ-అప్ మొత్తం: రూ.7,635.22 కోట్లు
ఇందులో దక్షిణ డిస్కం వాటా: రూ.5,665.42 కోట్లు
ఉత్తర డిస్కం వాటా: రూ.1,969.80 కోట్లు
వ్యవసాయ రంగానికి సంబంధించిన మొత్తం: రూ.2,214.99 కోట్లు
- వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన మొత్తం: రూ.5,420.23 కోట్లు