Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 90శాతం వరకు తగ్గింపు.. నేటి నుంచి చెల్లించుకోవచ్చు
పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 90 శాతం వరకు రాయితీని అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టింది. బకాయి చలాన్‌లను క్లియర్ చేసేలా ప్రజలను ప్రోత్సహించడంతో ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా చేయడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ మంగళవారం రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 26, 2023 అంటే నేటి నుంచి జనవరి 10, 2024 వరకు ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా పెండింగ్ చలాన్లపై రాయితీ చెల్లించొచ్చు.
రాయితీలు ఇలా ఉన్నాయి..
ద్విచక్ర వాహనాలు, ఆటో-రిక్షాలు చలాన్ మొత్తంలో 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అంటే వీరికి పెండింగ్ చలాన్‌లపై 80 శాతం తగ్గింపు ఉంటుంది. తోపుడు బండ్లపై విధించిన చలాన్లలో కేవలం 10 శాతం మాత్రమే చెల్లించాలి. వీరికి 90 శాతం తగ్గింపు లభిస్తుంది. కార్లు, జీపులతో సహా తేలికపాటి మోటారు వాహనాల (LMVలు) చలాన్లపై 40 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అంటే వీరికి 60 శాతం మాఫీ అవుతుంది. అలాగే భారీ వాహలనాల చలాన్లపై 50శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. రోడ్డు రవాణా సంస్థ (RTC) డ్రైవర్లకు కూడా 90 శాతం రాయితీని ప్రభుత్వం అందించింది.