Loading...
Telangana: 2027 డిసెంబరుకు 67 యంగ్‌ ఇండియా స్కూళ్లు.. అధికారులకు సీఎస్‌ ఆదేశం
2027 డిసెంబరుకు 67 యంగ్‌ ఇండియా స్కూళ్లు.. అధికారులకు సీఎస్‌ ఆదేశం

Telangana: 2027 డిసెంబరుకు 67 యంగ్‌ ఇండియా స్కూళ్లు.. అధికారులకు సీఎస్‌ ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఏడాది డిసెంబరు నాటికి తెలంగాణలో 67 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణ పనులతో పాటు ఫ్యూచర్‌ సిటీలో అంతర్జాతీయ విద్యా సంస్థలు, విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 119నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2027 డిసెంబరు నాటికి 67 పాఠశాలలను, 2028 జూన్‌ నాటికి మరో 20 పాఠశాలలను కలిపి మొత్తం 87స్కూళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు.

వివరాలు 

ఫ్యూచర్‌ సిటీలో విదేశీ వర్సిటీలకు ప్రత్యేక పాలసీ

నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

ఫ్యూచర్‌ సిటీలో ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే పలు అంతర్జాతీయ వర్సిటీలు ఫ్యూచర్‌ సిటీలో తమ క్యాంపస్‌లను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు అధికారులు సీఎస్‌కు వివరించారు.

ఈ నేపథ్యంలో విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి ఆకర్షించేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ఆయన సూచించారు.

క్యాంపస్‌ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, పెట్టుబడులు, ఇతర సదుపాయాలను పాలసీలో పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.

అంతర్జాతీయ విద్యా సంస్థలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

వివరాలు 

గ్లోబల్‌ సమిట్‌ ఏర్పాట్లపై సమీక్ష

గ్లోబల్‌ సమిట్‌లో తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ కంపెనీలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు.

సమిట్‌ నిర్వహణకు సంబంధించి వివిధ శాఖలు ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.

అన్ని ఏర్పాట్లను ముందుగా రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.

సమ్మిట్‌కు సంబంధించిన అన్ని రంగాల్లో టెండరింగ్‌ ప్రక్రియను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసినట్లు అధికారులు సమావేశంలో సీఎస్‌కు తెలిపారు.

సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ADVERTISEMENT