Birth Certificate : తెలంగాణలో కొత్త CRS పోర్టల్.. 3 రోజుల్లో బర్త్, డెత్ సర్టిఫికేట్లు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పోర్టల్‌ను ప్రారంభించనుంది. అన్ని రాష్ట్రాలు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) పోర్టల్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దరఖాస్తుదారులకు 3 నుంచి 5 రోజుల్లోనే జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సర్టిఫికెట్లు పొందడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొత్త పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఈ సమస్యలకు చెక్ పడనుంది.తెలంగాణలో కొత్త CRS పోర్టల్.. 3 రోజుల్లో బర్త్, డెత్ సర్టిఫికేట్లు
వివరాలు
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు.. త్వరగా సర్టిఫికెట్
ఈ కొత్త పోర్టల్ ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం అవసరమైన పత్రాలతో పాటు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా నమోదు చేసుకోవాలనుకునే వారికి కూడా ఇదే వేదిక ఉపయోగపడుతుంది. దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే సర్టిఫికెట్లను నేరుగా పోర్టల్ నుంచే డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు.
వివరాలు
చట్టపరంగా బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2023 చట్టంగా మారిన తర్వాత, 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి వ్యక్తికి జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అయింది. పుట్టిన తేదీ నిరూపణకు రిజిస్ట్రార్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికార సంస్థ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ ఉండాల్సిందే.
వివరాలు
ఈ పనులన్నింటికీ బర్త్ సర్టిఫికెట్ అవసరం
జనన ధృవీకరణ పత్రం అనేక కీలక అవసరాల కోసం ఉపయోగపడుతుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం, ఓటర్ల జాబితాలో పేరు నమోదు, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు, పాస్‌పోర్ట్ పొందడం, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయడం వంటి అనేక సేవలకు ఇది తప్పనిసరి. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఇతర సేవల కోసం కూడా బర్త్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది.
వివరాలు
మరణ ధృవీకరణ పత్రం ఉపయోగాలు
మరణ ధృవీకరణ పత్రం కూడా అంతే కీలకం. పూర్వీకుల ఆస్తులను వారసులకు బదిలీ చేయడం, జీవిత బీమా క్లెయిమ్ చేయడం, పింఛన్ పొందడం, భర్త మరణించిన తర్వాత భార్యకు పెన్షన్ దరఖాస్తు చేయడం వంటి సందర్భాల్లో ఇది అవసరం అవుతుంది.