Loading...
Telangana: క్యాన్సర్‌ నిర్ధారణకు తెలంగాణలో నాలుగు కొత్త మొబైల్‌ స్క్రీనింగ్‌ యూనిట్లు
క్యాన్సర్‌ నిర్ధారణకు తెలంగాణలో నాలుగు కొత్త మొబైల్‌ స్క్రీనింగ్‌ యూనిట్లు

Telangana: క్యాన్సర్‌ నిర్ధారణకు తెలంగాణలో నాలుగు కొత్త మొబైల్‌ స్క్రీనింగ్‌ యూనిట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కొత్త మొబైల్‌ స్క్రీనింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యుడు, రాష్ట్ర సలహాదారు నోరి దత్తాత్రేయుడు, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వివరాలు 

జనవరి 4 నుంచి కొత్తగా నాలుగు మొబైల్‌ స్క్రీనింగ్‌ యూనిట్లు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాల్లో కీమోథెరపీ సేవలను మరింత విస్తరించాలని అధికారులకు సూచించారు.

క్యాన్సర్‌ చికిత్స కోసం రోగులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జనవరి 4 నుంచి కొత్తగా నాలుగు మొబైల్‌ స్క్రీనింగ్‌ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

వీటి ద్వారా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రాంతీయ క్యాన్సర్‌ కేంద్రాల ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

వివరాలు 

యుద్ధ ప్రాతిపదికన వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

టిమ్స్‌ అల్వాల్‌, టిమ్స్‌ ఎల్‌బీనగర్‌, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 15వ తేదీ నాటికి ఔట్‌పేషెంట్‌ సేవలకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు.

ఈ సమీక్షలో కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్‌ ముషారఫ్‌ అలీ ఫరూఖీ, ఆరోగ్యశ్రీ సీఈవో హనుమంతు కొండిబా, మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, డీఎంఈ వాణి తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

క్యాన్సర్‌ నియంత్రణ చర్యలు అభినందనీయం

రాష్ట్రంలో క్యాన్సర్‌ నియంత్రణకు ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు సంతృప్తి వ్యక్తం చేశారు.

క్యాన్సర్‌ను నోటిఫయబుల్‌ వ్యాధిగా గుర్తించడం, క్యాన్సర్‌ రిజిస్ట్రీ ఏర్పాటు చేయడం, ప్రత్యేక క్యాన్సర్‌ పోర్టల్‌ను ప్రారంభించడం వంటి చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయని అభిప్రాయపడ్డారు.

ప్రతి జిల్లాలో డే కేర్‌ క్యాన్సర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, కీమోథెరపీ సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు.

ఎంఎన్‌జే, నిమ్స్‌ ఆసుపత్రుల్లో క్యాన్సర్‌ బాధితులకు రోబోటిక్‌ సర్జరీలు, బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రశంసించారు.

ADVERTISEMENT