Telangana Weather: తెలంగాణలో పగలు ఎండ.. రాత్రి వాన.. ఆరో తేదీ వరకు వర్షాలు..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ అనూహ్యంగా మారుతున్నాయి. పగలంతా మండే ఎండలు ఉండగా,సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా భారీ గాలులు,ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే వాతావరణం మారిపోవడంతో ప్రజలు,రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల పలుచోట్ల కురిసిన భారీ వర్షాల కారణంగా పొలాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో,వాహనాల్లో నిల్వ ఉంచిన ధాన్యం కూడా వానకు తడిసి రైతులకు నష్టం కలిగించింది. రాష్ట్రంలో జూన్ 6 వరకు వర్షాలు కొనసాగనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఉరుములు,మెరుపులు,గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురిసే అవకాశముందని తెలిపింది. అన్ని జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వివరాలు
ఎండల తీవ్రత కూడా..
వర్షాల సూచనలు ఉన్నప్పటికీ పలు జిల్లాల్లో ఎండల తీవ్రత తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. సోమవారం ఆదిలాబాద్,నిర్మల్,కుమురం భీమ్ ఆసిఫాబాద్,జగిత్యాల,నిజామాబాద్,కరీంనగర్, రాజన్న సిరిసిల్ల,మంచిర్యాల,పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి,ములుగు,వరంగల్,మహబూబాబాద్, సూర్యాపేట,ఖమ్మం,నల్గొండ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మంగళవారం నుంచి గురువారం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా గ్రామీణ ప్రాంతంలో 45.2డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో 29 జిల్లాల్లో 40.1 నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల,వికారాబాద్,నారాయణపేట జిల్లాల్లో 39.6 నుంచి 39.8డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు జిల్లా వాజేడు,మంగపేట,ఏటూరునాగారం మండలాల్లో వడగాలులు వీచినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ఐదేళ్లలో అధికం..
ఈ ఏడాది వేసవి తెలంగాణ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో గత రికార్డులను అధిగమిస్తూ పలుమార్లు 46.5 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వారం రోజులకుపైగా 45 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి వడగాలుల కారణంగా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి వానాకాలం ప్రారంభమైనప్పటికీ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించడానికి ఇంకా పది రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూన్ 6 తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గి వాతావరణం చల్లబడే అవకాశముందని పేర్కొంటున్నారు.