Loading...
municipal elections: ఏపీలో పుర ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్‌.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం
ఏపీలో పుర ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్‌.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

municipal elections: ఏపీలో పుర ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్‌.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్‌ 25వ తేదీ వరకు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు సమర్పించే నివేదికలను పరిశీలించిన అనంతరం గురువారం తుది నిర్ణయం వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అప్పటివరకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయవద్దని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ, బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటన నిలిచిపోయింది.

వివరాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ

బుధవారం రాత్రి న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఎన్నికల కమిషనర్‌ మరో కీలక ప్రకటన చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన 100 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాత్రి 10.30 గంటల తర్వాత వెల్లడించారు.

పిడుగురాళ్ల, గురజాల, దర్శి, పుంగనూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, దాచేపల్లి, గుత్తి, రాజంపేట, పులివెందుల, బద్వేలు, ప్రొద్దుటూరు, కనిగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతోపాటు కడప, తిరుపతి నగరపాలక సంస్థల్లో నామినేషన్లు వేయకుండా తమను అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

వివరాలు

48గంటల వరకు అవకాశం ఇవ్వాలి

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. అక్టోబర్‌ 25వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటనను నిలిపివేయాలని ఆదేశించింది.

నామినేషన్ల దాఖలుకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై గురువారం నిర్ణయం ప్రకటించాలని ఎన్నికల సంఘానికి సూచించింది.

అవసరమైన చోట నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాల్సి వస్తే, నిర్ణయం ప్రకటించిన సమయం నుంచి గరిష్ఠంగా 48 గంటల వరకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.

ఈ ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌ పునేఠా బుధవారం రాత్రి న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. అనంతరం ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ADVERTISEMENT

వివరాలు

అవాంఛనీయ ఘటనలు పునరావృతం కావొద్దు

అంతకుముందు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 19 పురపాలక, నగరపాలక సంస్థల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు.

బుధవారం ఆయన వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, మార్కాపురం మినహా మిగిలిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియలో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

నామినేషన్‌కు ఎన్వోసీ, నో డ్యూస్‌ సర్టిఫికెట్లు తప్పనిసరి కాదు

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు కొన్ని అదనపు ధ్రువపత్రాలు సమర్పించాలంటూ అధికారులు కోరుతున్న విషయంపైనా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.

అభ్యర్థులపై కేసులు లేవని నిర్ధారించే పోలీసుల నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్వోసీ), పురపాలక లేదా నగరపాలక సంస్థలకు ఎలాంటి బకాయిలు లేవని ధ్రువీకరించే నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలనే నిబంధన ఎన్నికల నియమావళిలో లేదని ఎస్‌ఈసీ పేర్కొంది.

కొంతమంది రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల అధికారులు ఈ ధ్రువపత్రాలను వెంటనే సమర్పించాలని కోరుతున్నట్లు పలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చాయి.

దీంతో ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అదనపు నిబంధనలు విధించవద్దని అధికారులను ఆదేశించింది.

ADVERTISEMENT