LOADING...
TG SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలకు తేదీ ఖరారు..! ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

TG SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలకు తేదీ ఖరారు..! ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 28, 2026
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పదో తరగతి చదివిన విద్యార్థుల ఎదురుచూపులు ముగియబోతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఈ నెల 29 లేదా 30 తేదీల్లో విడుదలయ్యే అవకాశముందని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తోంది. మొదట ఫలితాలు మే మొదటి వారంలో వస్తాయని భావించినప్పటికీ, మూల్యాంకన ప్రక్రియ వేగంగా పూర్తికావడంతో ముందుగానే ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. స్పాట్ మూల్యాంకనం సహా అన్ని ప్రక్రియలు సమయానికి ముగియడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.

వివరాలు 

పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది సాధారణ విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13తో ముగిశాయి. ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది సాధారణ విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయ్యగానే విద్యాశాఖ వేగంగా జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. ఈ నెల 23 నాటికే మూల్యాంకనం పూర్తి చేసి, మార్కుల నమోదు,సమీకరణ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసింది. దీంతో ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి.

వివరాలు 

ప్రభుత్వం ఆమోదం…

ఫలితాల విడుదలకు సంబంధించి విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నెల 29న ఫలితాలను విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకవేళ ఆ రోజు సాధ్యంకాకపోతే 30న ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

వివరాలు 

ఫలితాలు ఎక్కడ, ఎలా చూడాలి…?

తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ లేదా results.cgg.gov.in వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలను పరిశీలించవచ్చు. ఈసారి విద్యార్థులకు మరో సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు..... తాజాగా ఫలితాలను సైతం వాట్సాప్‌ ద్వారా తెలుసుకొనే వీలు కల్పించింది.. పరీక్ష రాసిన విద్యార్థులు 80969 58096 నంబర్‌కు 'హాయ్' అని సందేశం పంపాలి. తరువాత సూచనల ప్రకారం హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే, ఫలితం నేరుగా మొబైల్ తెరపై కనిపిస్తుంది.

Advertisement